
Smoke Detectors Mandatory at Homes : దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హౌజ్ రాణి అగ్ని ప్రమాదంలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఢిల్లీ ప్రజల్లో భయాందోళనకు
గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇండ్లలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. భవన నిర్మాణ నిబంధనల్లో సమగ్ర మార్పులను ప్రభుత్వం పరిశీలిస్తున్నందున ఢిల్లీలోని ప్రతి ఇంటిలో స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు తప్పనిసరి చేసే ఆలోచనలో ఉంది.
ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన పలు అగ్ని ప్రమాదాల నేపథ్యంలో నివాస ప్రాంతాల్లో సన్నద్ధత, అత్యవసర స్పందన, ప్రాథమిక అగ్నిమాపక భద్రతా మౌలిక సదుపాయాల లభ్యతపై ప్రశ్నలు తలెత్తడంతో స్థానిక ప్రజల్లో అగ్నిప్రమాద ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, ఢిల్లీలోని 90శాతం భవనాలకు ఫైర్ సేప్టీ నిబంధనల ప్రకారం అవసరమైన ఫైర్ ఎన్ఓసీ (No Objection Certificate) లేదని మంత్రి ఆశిష్ సూద్ వెల్లడించారు.
ఇళ్లలో అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణాలు విద్యుత్ వ్యవస్థలో లోపాలు, ఓవర్ లోడింగ్, నిబంధనల ఉల్లంఘనలేనని మంత్రి అశిష్ సూద్ తెలిపారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాల్సి ఉందని అన్నారు. మరోవైపు ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ప్రాణాలను కాపాడే అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తాయని పేర్కొంటూ.. ప్రతి ఇంట్లో స్మోక్ డిటెక్టర్లను తప్పనిసరి చేయాలని ఢిల్లీ అగ్నిమాపక సేవల విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఫైర్ హైడ్రెంట్లు, స్మోక్ డిటెక్టర్లు వంటి భద్రతా పరికరాలు వాణిజ్య భవనాలు, 15మీటర్లకుపైగా ఎత్తున ఉన్న భవనాలకు మాత్రమే తప్పనిసరి చేశారు. అయితే, స్వతంత్ర ఇళ్లు, తక్కువ అంతస్తుల భవనాలు, రెసిడెన్షియల్ కాలనీల్లో ఈ నిబంధనలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదనల ప్రకారం.. ప్రతి ఇంటిలో స్మోక్ డిటెక్టర్లను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఇంట్లో పొగ వ్యాపించిన వెంటనే అలారం మోగి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తుంది. దీని వల్ల అగ్నిప్రమాదాలు పెద్ద స్థాయికి చేరకముందే నివారించే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.