
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో ఈ లోహాలకు డిమాండ్ దక్కింది. దీంతో దేశీయ విపణిలోనూ
వీటి ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల పసిడి (Gold) ధర రూ.1,52,200కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.3వేల పైన పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.2.49లక్షలు పలికింది. దీని ధర ఒక్క రోజే దాదాపు రూ.9వేల మేర పెరగడం గమనార్హం. (Gold, Silver rates in Hyderabad)
అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు పెరిగాయి. నేడు ఔన్సు పుత్తడి ధర 4205 డాలర్లు పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 100 డాలర్ల పైన పెరిగింది. ఇక ఔన్సు వెండి ధర 67.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.50లక్షలు, వెండి ఫ్యూచర్స్ ధర రూ.2.43లక్షల వద్ద కొనసాగుతోంది.
ఇరాన్‌పై తాజా దాడుల్ని విరమించుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెహ్రాన్‌తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని, ఆ దేశ అగ్రనాయకత్వం తమ ప్రతిపాదనలకు అంగీకరించిందని చెప్పారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గొచ్చనే అంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు కూడా దిగొచ్చాయి. అటు మన దేశ కరెన్సీ రూపాయి విలువ కూడా భారీగా కోలుకుంది. నేటి మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే 60 పైసలు బలపడి 95.25 వద్ద ట్రేడ్ అవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.