
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలు చింతకాయల విజయ్, సాన సతీశ్, భాష్యం రామకృష్ణలను ఆయన
అభినందించారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున బలమైన గొంతుకగా నిలవాలని వారికి దిశానిర్దేశం చేశారు.ఈ భేటీకి సంబంధించిన వివరాలను లోకేశ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. "కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులను కలవడం సంతోషంగా ఉంది. వారికి నా అభినందనలు తెలిపాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో గట్టిగా గళం వినిపించాలని కోరాను" అని ఆయన పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ప్రగతికి తోడ్పడాలని ఎంపీలకు లోకేశ్ సూచించారు. రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా వారు సమర్థవంతంగా పనిచేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వారి పదవీకాలం దిగ్విజయంగా, ప్రభావవంతంగా సాగాలని ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.