భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరీ.. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో తలపడే ఆస్ట్రేలియా జట్టులో 30 ఏళ్ల నిఖిల్ చోటు దక్కించుకున్నాడు. ఆరు
దశాబ్ధాల తర్వాత భారత క్రికెటర్ .. ఆస్ట్రేలియా తరపున ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమయ్యాడు. భారత దేశ రాజధాని ఢిల్లీలో జన్మించిన ఈ క్రికెటర్.. అనూహ్యంగా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. కొవిడ్ అతడి జీవితాన్ని మార్చేసింది.2020లో తమ బంధువులను చూసేందుకు నిఖిల్ చౌదరీ .. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు వెళ్లాడు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అతడు.. అక్కడే చిక్కుకుపోయాడు. స్వదేశానికి రాలేకపోయాడు. ఈ పరిణామాలతో అతడు అక్కడే స్థిరపడ్డాడు. కెరీర్ తొలి నాళ్లలో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కూడా వివిధ రకాల పనులు చేస్తూ జీవించాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు.. లెగ్ స్పిన్‌తో రాణించే నిఖిల్ చౌదరీ.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ హోప్స్ దృష్టిలో పడ్డాడు. ఇదే అతడి కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా మారింది.జేమ్స్ హోప్స్ ప్రోత్సాహంతో స్థానికంగా చౌదరీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. తన ప్రదర్శనతో సత్తాచాటి.. దేశవాళీల్లో టాస్మేనియా దేశవాళీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాష్‌లీగ్‌లో ఆడే అవకాశం అతడికి వచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తరఫున బీబీఎల్ ఆడిన ఈ 30 ఏళ్ల ఆల్ రౌండర్ అదరగొట్టాడు. 32 మ్యాచులలో 693 పరుగులు చేశాడు. అంతేకాకుండా 9 వికెట్లు సైతం పడగొట్టాడు. 2024-2025 సీజన్లో బిగ్ బాష్ సీజన్లో హోబర్ట్ హరికేన్స్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు అతడిని ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎంపిక చేశారు. జూన్ 17 నుంచి 21 వరకు టీ20 సిరీస్ జరగనుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఎవరైనా ఆటగాడు.. వరుసగా ఐదేళ్ల ఒక దేశంలో నివసిస్తే.. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చు.ఆస్ట్రేలియా తరపున భారత సంతతి క్రికెటర్లు గతంలోనూ ఆడారు. గుర్వీందర్ సింధు, తన్వీర్ సంఘాలు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. కానీ వాళ్లు 1960 కన్నా ముందు ఆసీస్ తరపున ఆడారు. చివరిసారి 1964లో రెక్స్ సెల్లార్స్ అనే గుజరాతీ ప్లేయర్ ఆసీస్ తరపున ఆడాడు. తాజాగా 60 ఏళ్ల రికార్డును చౌదరీ బ్రేక్ చేయనున్నాడు. 2017-2019 మధ్య కాలంలో పంజాబ్ జట్టు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో ఆడాడు. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి నిఖిల్ దేశవాళీ క్రికెట్ ఆడటం గమనార్హం.