
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమదేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) మరోసారి షాక్ ఇచ్చారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తోన్న విధానంపై ఐరోపా దేశాలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు
. రష్యా చమురు (Russia oil) కొంటున్నందుకు తమను ప్రశ్నిస్తోన్న ఆ దేశాలు విక్రయించిన ఆయుధాలతో ప్రత్యర్థులు భారత్‌పై దాడులకు ఉపయోగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసందర్భంగా భారత్ దేశ ఇంధన ఎంపికలను ఆయన సమర్థించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను స్థిరీకరించేందుకు అమెరికానే రష్యా చమురు కొనుగోలు చేయమని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఫిన్లాండ్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి రష్యా (Russia)తో భారత్ మరీ సానుకూలంగా వ్యవహరిస్తోందని, ఆ దేశ చమురుపై అతిగా ఆధారపడుతోందని ఈ చర్చలో మంత్రికి ప్రశ్న ఎదురైంది. దానికి మంత్రి సూటిగా బదులిచ్చారు. భారతదేశ ప్రత్యర్థులకు ఐరోపా దేశాలు ఆయుధాలు అమ్మిన విషయాన్ని గుర్తుచేసి, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్ తయారుచేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశం పైనా దాడి జరగలేదు. ఐరోపా ఆయుధాల విషయంలో కూడా నేను అలా చెప్పగలిగితే బాగుండేది. ఐరోపా ఆయుధాలు అమ్మింది. వాటిని భారత్‌పై దాడి చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడే కాదు.. కొన్నేళ్లుగా అలా జరుగుతోంది. ఐరోపాను ప్రమాదంలో పడేసే పని ఏదీ భారతీయులు చేయలేదు’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.