
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులను చివరి నిమిషంలో రద్దు చేశారు. బదులుగా ఉన్నత స్థాయి దౌత్య చర్చలు జరపాలని నిర్ణయించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై దాడులను చివరి నిమిషంలో రద్దు చేసి, దౌత్య చర్చలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇరాన్ నాయకులతో, ప్రపంచ దేశాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ విషయంలో చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఇరాన్ పై దాడులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు బదులుగా ఉన్నత స్థాయి దౌత్య చర్చలు జరపాలని నిర్ణయించారు.ఇరాన్ నాయకులతో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం బయటకు వచ్చింది. అలాగే ట్రంప్ ప్రపంచ దేశాలతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌ లో ట్రంప్ ప్రకటించారు.అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు ఇతర మధ్య ప్రాచ్య దేశాలు ఈ దౌత్య ప్రయత్నాలకు మద్దతు ఇచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. దాడులు రద్దు అయినా హార్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగనుంది. చర్చలు పూర్తి అయి ఒప్పందం కుదరగానే ఈ బ్లాకేడ్ ను తొలగించనున్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందంపై త్వరలోనే కీలక ప్రకటన రానున్నట్లు స్పష్టం అవుతోంది. ట్రంప్ చివరి నిమిషంలో తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.కొద్ది గంటల క్రితమే ఇరాన్ పై ట్రంప్ కీలక పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.. ఈ రాత్రికి ఇరాన్‌ ను కోలుకోలేని దెబ్బ తీస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ లోని చమురు గ్యాస్‌ ఇన్‌ ఫ్రా మార్కెట్లను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇరాన్ కు చెందిన నౌకాదళం, వైమానిక దళం, రాడార్‌ వ్యవస్థలను ఇప్పటికే కూల్చేశామని.. త్వరలోనే ఇరాన్ వ్యూహాత్మక ఖర్గ్ ఐలాండ్ ను కూడా స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్న విషయం తెలిసిందే.