
ఒమన్ తీరంలో 'MT సెట్టెబెల్లో' నౌకపై అమెరికా క్షిపణి దాడులకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట జరిగిన ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని
విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ: ఒమన్ తీరంలో 'MT సెట్టెబెల్లో' నౌకపై అమెరికా క్షిపణి దాడులకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట జరిగిన ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ ఉన్నట్లు సమాచారం. దీంతో ఒమన్‌లోని భారత రాయబారి జి.ఏ.శ్రీనివాస్‌తో ఏపీ భవన్ బృందం సంప్రదింపులు జరిపింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, తగిన చర్యలు తీసుకుంటామని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
సురేశ్ మృతిచెందినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. సురేశ్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు, ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం స్వతంత్రంగా నిజనిర్ధారణ చేస్తోంది. నౌకపై దాడి తర్వాత సిబ్బంది అందరినీ ఖాళీ చేయించారని.. అయితే, ముగ్గురు సిబ్బంది మాత్రం అదృశ్యమైనట్లు ఎంబసీ వెల్లడించింది. లభ్యమైన మృతదేహాలు ఎవరివో గుర్తించేందుకు, దాడికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది.
అధికారిక నిర్ధారణ కోసం స్థానిక అధికారులు, షిప్పింగ్ కంపెనీ, భారత విదేశాంగ శాఖతో ఏపీ భవన్, భారత రాయబార కార్యాలయం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా, హోర్ముజ్ జలసంధి, ఒమన్ తీరప్రాంతంలో తమ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్ చమురును రవాణా చేస్తున్న విదేశీ నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేస్తోంది. ఈ మేరకు MT సెట్టెబెల్లోపైనా క్షిపణి ప్రయోగించింది. ఈ సమయంలో నౌకలో మొత్తం 28మంది ఉన్నారు. వారిలో 24మంది భారతీయులు కాగా.. నలుగురు విదేశీయులు ఉన్నారు. ఈ ఘటనలో ఏపీ వాసి పట్నాల సురేశ్‌తో పాటు డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా మృతిచెందినట్లు తెలుస్తోంది.
జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు: హోంమంత్రి అనిత
ప్రధాని మోదీ దేశాన్ని సరికొత్త దిశగా తీసుకెళ్తున్నారు: సీఎం చంద్రబాబు