V2V System: వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. నిత్యం వేలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్‌కి అనుగణంగా రోడ్లు విస్తరిస్తన్నా, ప్రభుత్వం వివిధ రకాల చర్యలు
చేపడుతున్నా రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. ఒక వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టి రోజూ ఎక్కడో ఒక చోట మనుషులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయితే, ఈ తరహా ప్రమాదాల నివారణకు కేంద్రం ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కొత్తగా ప్రమాద నివారణ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురోబోతోంది. కార్లు, లారీలు, టూవీలర్లకు వెహికల్ టూ వెహికల్ కమ్యూనికేషన్ సిస్టమ్‌ను తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ఉద్దేశించిన ముసాయిదా రూల్స్ తాజాగా విడుదల చేసింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై జూన్ 20వ తేదీలోపు అభిప్రాయాలు తెలపాలని వెల్లడించింది.వాహనాలు ఎలా మాట్లాడుకుంటాయి?రోడ్డు ప్రమాదాలు జరగకుండా రహదారి భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది. టూవీలర్లు, త్రీవీలర్లు, కార్లు, లారీలు, బస్సులు వాటి వేగం, లొకేషన్ ప్రయాణించే దిశ, బ్రేకింగ్ వంటి కీలక సమాచారాన్ని రియల్ టైమ్‌లో ఒకదానితో ఒకటి పంచుకుంటాయి. దీంతో ప్రమాదం జరగడానికి ముందే డ్రైవర్లను అప్రమత్తం చేయొచ్చు. ముందు వెళ్లే వాహనం సడెన్ బ్రేకు వేస్తే వాహనాలు పరస్పరం ఢీకొట్టకుండా ఈ వ్యవస్థ నివారిస్తుంది.ఈ వ్యవస్థ వెహికల్ టూ ఎవ్రీథింగ్ (V2X) టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. మొబైల్ నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా వాహనాలు పరస్పరం సందేశాలు పంచుకుంటుంటాయి. 5,875- 5,905 మెహా హెర్జ్ బ్యాండ్ పై వీ2వీ టెక్నాలజీ పనిచేస్తుంది. 5,905- 5,925 మెగా హెర్జ్ బ్యాండ్ పై తదుపరి తరం ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ కోసం కేటాయించారు. కచ్చితమైన లొకేషన్ సమాచారం కోసం వీ2వీ సిస్టమ్ మన సొంత ఉప గ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్‌తో పాటు జీపీఎస్, గగన్‌లను ఉపయోగించుకోనుంది. ఇది ఓపెన్ స్కై పరిస్థితుల్లో 2.5 మీటర్ల కంటే మెరుగైన కచ్చితత్వంతో సెకనుకు కనీసం 10 సార్లు లొకేషన్ డేటాను అప్డేట్ చేస్తుంది. ఈ పరికరం ధర రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఉంటుంది.టూ-వీలర్, త్రీ-వీలర్, ప్యాసింజర్, సరకు రవాణా వాహనాలకు ఆన్‌బోర్డు యూనిట్లను అమర్చాల్సి ఉంటుంది. ఈ సిస్టమ్ వల్ల రోడ్డు ప్రమాదాలు 80 శాతం వరకు తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమం వేదికగా అభిప్రాయపడ్డారు. ఈ 2026 ఏడాది చివరి నాటికి ఈ వీ2వీ సిస్టమ్ పరికరాన్ని వాహనాల్లో తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.