
ఓటీటీలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఓటీటీ కంటెంట్‌ని ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. దీంతో సినిమాలు థియేటర్లో కంటే ఓటీటీలోనే బాగా ఆడుతున్నాయి. కామెడీ చిత్రాలు, థ్రిల్లర్స్ , యాక్షన్ ఫిల్మ్స్ బాగా
ఆదరణ పొందుతున్నాయి. విచిత్రం ఏంటంటే థియేటర్లో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలు ఓటీటీలో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తున్నాయి. మేకర్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ప్రైమ్ వీడియోస్‌లో థియేటర్లో యావరేజ్ ఆడిన సినిమాలు టాప్ లో ఉండటం ఓ విశేషమైతే, అందులో తెలుగు సినిమాలు దుమ్ములేపుతుండటం మరో విశేషం.
ప్రైమ్ వీడియోలో తెలుగు సినిమాలు హవా చూపిస్తున్నాయి. టాప్ 10లో తెలుగువే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక మొదటి ప్లేస్ లో అడవి శేష్ నటించిన `డెకాయిట్` ఉంది. ఇది థియేట్రికల్‌గా ఆకట్టుకోలేకపోయింది. ప్రారంభంలో ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత డీలా పడింది. నిర్మాతలు, బయ్యర్లకి నష్టాలను మిగిల్చింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా, ప్రకాష్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో మొదటి స్థానంలో ట్రెండ్ కావడం విశేషం.
ఇక రెండో స్థానంలో కూడా తెలుగు సినిమానే ఉంది. అడే `అగ్లీ స్టోరీ`. నందు, అవికా గోర్ జంటగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రమిది. థియేటర్లో డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. మూడో స్థానంలో హిందీ మూవీ `సిస్టెమ్` ఉంది. ఇందులో జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కూడా థియేటర్లో ఆడలేదు. కానీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్ 3లో ట్రెండ్ అవుతుంది.
ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా నాల్గో స్థానంలో మరో తెలుగు సినిమా ఉంది. అదే `గోదారి గట్టుపైన`. విలేజ్ లవ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఫర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ రచ్చ చేస్తోంది. గత వారం వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇందులో సుమంత్ ప్రభాస్ హీరోగా నటించగా, నిధి ప్రదీప్ హీరోయిన్గా నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.
ఐదో స్థానంలో తమిళ సినిమా కార్మేని సెల్వం ఉంది. సముద్రఖని, గౌతమ్ మీనన్, అభినయ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. బ్యాంక్ లోన్ల నేపథ్యంలో సాగుతుంది. అతికి పోయి జీవితంలో ఇబ్బంది పడే సంఘటన ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. అయితే ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. ఆరో స్థానంలోనూ మరో తమిళ సినిమా ఉంది. `సట్టెండ్రు మారుదు వానిలై` అనే మూవీ ట్రెండ్ అవుతుంది.
ఏడో స్థానంలో ఇంకో తమిళ సినిమా ఉంది. లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన `లీడర్`మూవీ ట్రెండ్ అవుతుంది. ఇందులో పాయల్ రాజ్‌పూత్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. థియేటర్లో మంచి ఆదరణ పొందిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతుండటం విశేషం. 8వ స్థానంలో హాలీవుడ్ ఫిల్మ్ జాక్ ర్యాన్ `ఘోస్ట్ వార్` ఉంది. అలాగే తొమ్మిదో స్థానంలో `ప్రైమేట్`, పదవ స్థానంలో మరో కోలీవుడ్ ఫిల్మ్ `కాలిదాస్ 2` వంటి చిత్రాలు ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.