తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న మూకాంబిక అమ్మవారిని దర్శించుకోనున్నారు. మంగళూరు సమీపంలోని కొల్లూరులోని అమ్మవారి ఆలయానికి శుక్రవారం మధ్యాహ్నం విజయ్ వస్తున్నట్టు
పోలీసులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటలకు అమ్మవారిని విజయ్ దర్శించుకుంటారు. చెన్నై నుంచి విమానంలో బయలుదేరి.. మధ్యాహ్నం 12.30 గంటలకు మంగళూరు విమానాశ్రయానికి సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా కొల్లూరుకు వెళ్తారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత తిరిగి సాయంత్రం చెన్నైకు ప్రయాణమవుతారు. దీంతో ఆయన పర్యటన కోసం కర్ణాటక పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. మార్గమధ్యంలో అభిమానులు గుమిగూడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక పోలీసులకు తమిళనాడు అధికారులు రిక్వెస్ట్ చేశారు.అయితే, 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జె.జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ.30,000 జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటే ఎంచుకున్న రంగంలో విజయం సాధిస్తారని బలంగా నమ్ముతారు. అందుకే రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులతో పాటు సామాన్యులు ఈ మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. కర్ణాటకలోని ఏడు ముక్తి స్థలాల్లో కొల్లూర్ మూకాంబిక దేవి ఆలయం ఒకటి. సౌపర్ణిక నదీ తీరంలోని కోడచాద్రి కొండలపై ఉండే ఈ ఆలయాన్ని కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి మూసాసురుడిగా పిలిచేవారు. అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్జయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరంం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట. ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. దేవత మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండటంతో భక్తులు అక్కడకు కష్టతరం కావడంతో కొల్లూరులో ఆలయాన్ని శంకరాచార్య తిరిగి ప్రతిష్ఠించారని నమ్ముతారు.