
పూజా హెగ్డే అద్దిరిపోయే హిట్ చూసి ఐదేళ్లు దాటింది. ఈ ఐదేళ్లలో ఎనిమిది సినిమాలు చేస్తే అన్ని ఫ్లాప్లే. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలో కూడా లక్ పరీక్షించుకున్నా ఎక్కడా వర్కవుట్ కావటం లేదు. ప్రెజెంట్
ఈ అమ్మడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. మరి హిట్ తీసుకొచ్చే సినిమా ఏంటో చూద్దామా? పూజా హెగ్డే ఫ్లాప్స్ లో డబుల్ హ్యాట్రిక్ దాటేసి, ట్రిపుల్ హ్యాట్రిక్ పై కన్నేసిందా అనిపిస్తుంది. 2021లో రిలీజ్ అయిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తర్వాత ఆమెకు సరైన హిట్ పడలేదు. రెండు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేస్తే.. ఒకటి హిట్టు, మరొకటి ఫట్టు అయ్యాయి. స్పెషల్ సాంగ్ లో మెరిసిన ‘కూలీ’ ఫ్లాప్ కాగా, ‘F3’ ఓకే అనిపించుకుంది.
పూజా హెగ్డే సక్సెస్ ప్రయాణం ‘అరవింద సమేత వీరరాఘవ’తో మొదలైంది. ఆ తర్వాత నటించిన మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ ఫుల్ 4, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ చూపింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘రాధేశ్యామ్’తో మొదలైన ఫెయిల్యూర్ సిరీస్.. ఐదేళ్లు గడిచినా ఆగడం లేదు. విజయ్ తో ‘బీస్ట్’, రణవీర్ సింగ్ తో ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ తో జతకట్టిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, షాహిద్ కపూర్‌తో నటించిన ‘దేవా’, సూర్యతో చేసిన ‘రెట్రో’.. లేటెస్ట్ గా వరుణ్ ధావన్‌తో చేసిన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ కూడా నిరాశనే మిగిల్చాయి. ఫ్లాప్‌లను అడ్డుకునే సినిమా ఒక్కటి కూడా పడలేదు.
దీంతో ఐరన్ లెగ్ ముద్ర పడడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పూజాను దూరంగా పెట్టింది. మొదట ఇచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి లాగేసుకుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ముందుగా పూజాను సెలెక్ట్ చేసి, చివరకు శ్రీలీలను తీసుకున్నారు. ‘గుంటూరు కారం’లో అయితే ఒక షెడ్యూల్ కూడా తీసిన తర్వాత ఆమెను తప్పించారు. ఎట్టకేలకు దుల్కర్ సల్మాన్ తో జతకట్టి, ఒక తెలుగు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో ఆఫర్స్ మొహం చాటేయడంతో తమిళ, హిందీ సినిమాలతో పూజ కాలక్షేపం చేస్తోంది. ప్రస్తుతం తమిళంలో ‘కాంచన 4’లో నటిస్తోంది. అలాగే ‘జననాయగన్’ రిలీజ్ కు రెడీగా ఉంది.
రీసెంట్ గా రిలీజ్ అయిన ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ సక్సెస్ తీసుకొస్తుందని పూజ ఆశగా ఎదురుచూసింది. ప్రమోషన్స్ కూడా గట్టిగా చేసినా బాక్సాఫీస్ వద్ద సౌండ్ వినిపించడం లేదు, కలెక్షన్స్ సోసోగానే ఉన్నాయి. ఐదేళ్లుగా ఎనిమిది ఫ్లాప్‌లు ఇచ్చినప్పటికీ పూజకు ఆఫర్స్ తగ్గలేదు కానీ, ఎప్పుడూ ఏదో ఒక హిందీ మూవీతో బిజీగా ఉండే పూజ చేతిలో ఈసారి ఒక్క బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా లేదు. ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’లో గ్లామర్ గా, కలర్ ఫుల్ గా కనిపించినప్పటికీ ఐరన్ లెగ్ ముద్రకు దూరం కాలేకపోయింది. వరుణ్ ధావన్ సినిమా కూడా హ్యాండ్ ఇవ్వడంతో, ఇప్పుడు తమిళ స్టార్ విజయ్‌నే నమ్ముకుంది పూజ. విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ త్వరలో థియేటర్స్ లోకి రానుంది. తెలుగు సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ రీమేక్ గా ఈ ‘జననాయగన్’ రూపొందింది. తెలుగులో కాజల్ పోషించిన రోల్ ను తమిళంలో పూజా హెగ్డే పోషించింది.