
దర్శకుడు సంజీవ్ మేగోటి నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా ఈ నెల 12న విడుదల
కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రమోషన్ కార్యక్రమాల్లో దర్శకుడు సంజీవ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రిమెంట్ ఉల్లంఘించి ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారని, డబ్బింగ్‌కు సహకరించలేదని, సినిమా కాన్సెప్ట్ మాదిరిగానే కర్మ ఆమెను వదిలి పెట్టదని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఆమెకు సారీ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘వరలక్షీ కోసమే ఈ కథ రాసుకున్నా. ఈ సినిమా ప్రారంభం నుంచి సపోర్ట్ చేశారు. కానీ విడుదల డేట్ ఫిక్స్ అయిన తర్వాత వరలక్ష్మిగారితో ప్రమోషనల్ ఈవెంట్ చేయాలనుకున్నా. ఆమె రాలేదని బాధతో కొన్ని మాటలు దొర్లాయి. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలన్న తపనతో వచ్చిన మాటలే తప్ప.. ఆమెను నిందించాలని కాదు. చాలామంది నా సన్నిహితులు మీరు ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా.. ఎందుకిలా? అని అడిగాను. దీనికి నేను బాధపడ్డాను. నా మాటలకు వరలక్ష్మిగారు ఫీలయ్యారు.. అందుకు ఆమెను క్షమాపణ చెబుతున్నా. జనాలు కూడా ఇవన్నీ మరచిపోయి సినిమాను ఆదరించండి. ఇందులో వరలక్ష్మి పవర్ఫుల్, సీరియస్ రోల్ చేశారు. మంచి సినిమా అవుతుంది’ అని అన్నారు.
సంజీవ్ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలపై నటి వరలక్ష్మి కూడా స్పందించారు. ‘నా సినిమా టీమ్ కు అవసరం ఉన్న ప్రతిసారి నేను అందుబాటులో ఉన్నా. ఇటీవల జరిగిన వేడుకలో దర్శకుడు ఏం మాట్లాడారో నాకు పూర్తిగా తెలీదు. అయితే కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అందుకే చిత్ర బృందం చేస్తోన్న ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదు. అయితే నేను అందరిలా బయట ఎలా పడితే అలా మాట్లాడలేను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతాను' అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.