
పచ్చని ప్రకృతి.. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రశాంతత.. ఈ మాటలు వినగానే టక్కున గుర్తొచ్చే పేరు కేరళ.. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, పశ్చిమ కనుమలు, అబ్బుర
పరిచే సుగంధ ద్రవ్యాల తోటలు, అందమైన బీచ్ లు కేరళ సొంతం.. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు, పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే కొండలు, కోనలు.. ప్రశాంతమైన వాతావరణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. కేరళలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మున్నార్ ఒకటి.. కేరళలో అత్యంత ప్రజాదరణ పొందిన హిల్ స్టేషన్ మున్నార్.. ఇక్కడి టీ తోటలు, పొగమంచు కొండలు పర్యటకులను మంత్రముగ్దుల్ని చేస్తాయి. అలాగే ఇక్కడ ఎవరికులం నేషనల్ పార్క్, మట్టుపెట్టి డ్యామ్, ఆనముడి శిఖరం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.అలెప్పీ ప్రాంతాన్ని వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ గా అభివర్ణిస్తుంటారు. కేరళ బ్యాక్ వాటర్స్ కు ఈ ప్రాంతం గుండెకాయ వంటిది. ఇక్కడ హౌజ్ బోట్ ప్రయాణం, పున్నమడ లేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వర్షంలో బ్యాక్‌ వాటర్స్‌ లో కొబ్బరి చెట్ల మధ్య నుంచి హౌస్‌ బోట్ లో జర్నీ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఇక పచ్చని అడవులు, జలపాతాలు, గుహలతో వయనాడ్ ప్రాంతం పర్యటకులకు స్వర్గధామంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎడక్కల్ గుహలు, బాణాసుర సాగర్ డ్యామ్, చెంబ్రా పీక్ అలాగే వన్యప్రాణుల వీక్షణ, ట్రెక్కింగ్ మరచిపోలేని అనుభూతిని మిగులుస్తాయి.ఇక అరేబియా సముద్రపు రాణిగా కొచ్చి ప్రాంతాన్ని పిలుస్తుంటారు. ఫోర్ట్ కొచ్చి, చైనీస్ ఫిషింగ్ నెట్స్, మట్టంచేరి ప్యాలెస్, జ్యూ టౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే తేవడి లో స్పైస్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అడవిలోని పచ్చదనాన్ని ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక అతిరపల్లి జలపాతం జూన్ లో వర్షాల సమయంలో అత్యంత ఉధృతంగా, మహాద్భుతంగా కనువిందు చేస్తుంది. సాధారణంగా కేరళను సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక వర్షాకాలం అందాలను వీక్షించాలనుకునేవారికి జూన్ నుంచి ఆగస్టు వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.