
జాంబియా అడుగున కొత్త కదలికలు గుర్తించిన ఆక్స్ఫర్డ్ పరిశోధకులు జాంబియాలోని గ్విషో వేడినీటి బుగ్గల ప్రాంతమిది. చీలికకు ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించిన భూభాగం ఇదే. ఆఫ్రికా ఖండం రెండుగా
చీలిపోనుందా? భూగర్భంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆఫ్రికాలోని సరిహద్దుల్ని మార్చేయనున్నాయా?... అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. జాంబియా దేశం అడుగున కొత్త టెక్టానిక్ ప్లేట్ సరిహద్దు ఏర్పడుతోందని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా కనుగొన్నారు.
నైరుతి ఆఫ్రికా భూ పగుళ్ల వ్యవస్థలో ‘కఫూ రిఫ్ట్’ అనేది ఓ భాగం. ఈ కఫూ టాంజానియా నుంచి నమీబియా వరకు విస్తరించి ఉన్న 2,500 కిలోమీటర్ల పొడవైన పగుళ్ల వ్యవస్థ. ఈ కఫూ వెంబడే విభజన జరుగుతోంది. తూర్పు ఆఫ్రికా నుంచి బోట్స్వానా, నమీబియా మీదుగా అట్లాంటిక్ మహాసముద్రం వరకు ఖండం విడిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఆ బీటలు ఆఫ్రికాను నుబియాన్, సోమాలియా ప్లేట్లుగా విభజిస్తాయని అంటున్నారు. ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఎర్త్ సైన్స్’ అనే జర్నల్లో ఈ అధ్యయనం తాజాగా ప్రచురితమైంది. బలమైన భూకంపాలు, పెరిగిన భూగర్భ ఉష్ణోగ్రత, భూమి ఎత్తులో స్వల్ప మార్పులు.. ఇవన్నీ టెక్టానిక్ ప్లేట్ చురుకుదనాన్ని సూచిస్తున్నాయని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు రూటా కరోలైట్ చెప్పారు.
రిఫ్ట్ అంటే భూపటలంలో ఏర్పడే పగులు. ఇది ఉపరితలాన్ని కదిలించి, భూమి కుంగిపోవడానికి, భూకంపాలకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేలకొద్దీ రిఫ్ట్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు నిర్జీవంగా, నిష్క్రియగా ఉన్నా.. అవి అప్పుడప్పుడూ తిరిగి క్రియాశీలం కావొచ్చు. వందల ఏళ్లుగా నిర్జీవంగా ఉన్న కఫూ రిఫ్ట్ కొన్ని దశాబ్దాలుగా క్రియాశీలమవుతోందని గుర్తించారు. రిఫ్టింగ్ చాలాకాలం పాటు కొనసాగితే, అది చివరికి ఖండాలను చీల్చి.. పూర్తిగా కొత్త టెక్టానిక్ ప్లేట్లు, మహాసముద్రాలను సృష్టించగలదు.
జాంబియాలోని గ్విషో ప్రాంతంలో అనుమానిత పగులుపై సహజంగా ఏర్పడిన వేడినీటి బుగ్గలు, భూఉష్ణ బావుల నుంచి వెలువడే వాయువును నమూనాగా తీసుకున్నట్లు రూటా కరోలైట్ తెలిపారు. ఈ నమూనాల్లో అసాధారణ హీలియం ఐసోటోప్లు, మాంటిల్ ద్రవాలకు అనుగుణంగా ఉండే కార్బన్ డయాక్సైడ్ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇవి భూమిలోని వందలమైళ్ల మందంగల మాంటిల్ పొరతో నేరుగా అనుసంధానమయ్యేంత లోతుకు చొచ్చుకుపోయాయని కనుగొన్నారు. సాధారణంగా భూపటలంలో కనిపించే దానికంటే ఎక్కువ హీలియం-3 తమకు దొరికిందని, ఇది మాంటిల్లోని ద్రవాలు పైకి వస్తున్నాయనడానికి సంకేతమని కరోలైట్ వివరించారు. టెక్టానిక్ ప్లేట్లు సాగి, విడిపోవడం ప్రారంభించినప్పుడు భూపొరలోని పదార్థం ఉపరితలానికి చేరుతుంది కాబట్టి, తాము గుర్తించిన డేటా టెక్టానిక్ ప్లేట్ కొత్త సరిహద్దు ఏర్పడటాన్ని సూచించే తొలి సంకేతమని అధ్యయన బృందం తెలిపింది. కఫూ రిఫ్ట్ లోతుల్లో మాగ్మా చురుకుగా ఉందని, చీలికకు ఇది బలమైన సంకేతమని వివరించింది.
టెక్టానిక్ ప్లేట్లు కొన్ని వందల నుంచి వేల మైళ్ల వరకు విస్తరించిన భారీ ఘన శిలా ఫలకాలు. వీటి మందం సుమారు 120 మైళ్ల వరకు ఉంటుంది. కదులుతున్న ఈ ప్లేట్లు సుమారు 20 కోట్ల సంవత్సరాల క్రితం.. పాంజియా అనే భారీ భూభాగాన్ని నేటి ఖండాలుగా వేరు చేయడం ప్రారంభించాయి. ఈ ప్లేట్లు ఇప్పటికీ కదులుతూనే ఉన్నాయి. ఆ కదలిక భూకంపాలు, అగ్నిపర్వతాలు ఏర్పడడం వంటి భౌగోళిక ప్రక్రియలకు కారణమవుతుంది. ప్లేట్ల మధ్య సరిహద్దులు ఎక్కువగా సముద్రాల కింద ఉంటాయి. చాలా వరకు భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు కూడా ఈ సరిహద్దులే.
చీలికకు ఆధారాల్ని గుర్తించామంటే.. దానర్థం ఆఫ్రికా రేపే విడిపోతుందని కాదు.. ఇది జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భూ శాస్త్రాల విజిటింగ్ ప్రొఫెసర్, ఈ అధ్యయన సహ రచయిత మైక్ డెలీ అభిప్రాయపడ్డారు. ‘కొత్త చీలిక బాగా అభివృద్ధి చెంది.. ఆపై ప్లేట్ సరిహద్దుగా మారడానికి చాలా కాలం పడుతుంది. చీలిక సంభవించినపుడు ఆఫ్రికా దక్షిణ భాగం విడిపోతుంది. దానికన్నా ముందు మరిన్ని భూకంపాలు, లావాను విరజిమ్మే అగ్నిపర్వత కార్యకలాపాలు చోటుచేసుకుంటాయి’అని డెలీ వివరించారు. ప్రస్తుతం జాంబియాలో ఏర్పడుతున్న భూఉష్ణ బావుల శక్తిని వినియోగించుకోవడానికి అక్కడ విద్యుత్ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో హీలియంను కూడా జాంబియా సేకరించే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.