
దిల్లీ: కాంగ్రెస్లోకి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విలీనం కానుందన్న వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే, ఈ కథనాలను కాంగ్రెస్ (Congress) ఖండించింది. అవన్నీ నిరాధారమైనవేనని ఏఐసీసీ
ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయడంపైనే తమ చర్చలు సాగినట్లు వెల్లడించారు. ఇటీవల మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించి.. భాజపా మద్దతు ఉన్న అభ్యర్థి నామినేషన్ను అంగీకరించడం ప్రజాస్వామ్య దుస్థితిని చాటుతోందన్నారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు.
ఇతర పార్టీల ఎంపీలతో రాజీనామా చేయించి భాజపా (BJP)లో చేర్చుకోవడం సీట్ చోరీ లాంటిదేనని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ, రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక దుస్థితి, ధరల పెరుగుదల, పరీక్షల సంక్షోభం వంటి వాటికి ప్రధాని మోదీనే బాధ్యులని ఆరోపించారు. జూన్ నెలాఖరు నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని, దేశవ్యాప్తంగా 2-3 నెలల పాటు కొనసాగుతాయన్నారు. ‘ఓటు చోరీ’, ‘సీటు చోరీ’ అనే డబుల్ ఇంజిన్.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు.. పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జిలు, రాష్ట్రాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించినట్లు సమాచారం. కేవలం రాజకీయ పోరాటమే కాకుండా.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడం కూడా పార్టీ బాధ్యతని అగ్రనేతలు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మధ్యప్రదేశ్లో తన నామినేషన్ తిరస్కరణకు గురైన అంశంపై కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఈ పిటిషన్ ఎలా విచారణకు అర్హమైనదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. కనీసం రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశమున్న క్రిమినల్ కేసును అభ్యర్థి వెల్లడించాల్సి ఉంటుందని, కానీ ప్రస్తుత వ్యవహారంలో కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని ఆమె తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. పిటిషన్ ప్రతిని తమకు అందజేయలేదని ఎన్నికల సంఘం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.