
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ అంశంపై బీజేపీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాంచందర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు ఈ అంశాన్ని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం మత్పల్లిలో జరిగిన పార్టీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
గతంలో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. "కేరళ, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే.. ఓటర్లు తమకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటం, పారదర్శకతను పెంచడం" అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, అందుకే ప్రజలు తమను నమ్ముతున్నారని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను వంచించాయని ఆరోపించారు.