
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Telangana Census:తెలంగాణ రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర జనాభా లెక్కల విభాగం రాష్ట్రంలో గత నెల 11 నుంచి ఈ నెల 9 వరకు మొదటి దశ జనగణన పూర్తి చేసింది. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఎవరి ఇంటికైనా జనాభా లెక్కల సిబ్బంది రాకపోతే సమీపంలోని మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం వరకు తెలియజేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 9 వరకు ఆన్లైన్లో నమోదైన వివరాలతో ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 4.20 కోట్లు దాటిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జిల్లాల వారీగా చూస్తే జనాభా 3.50 కోట్లు ఉన్నట్లు తేలింది. అప్పటితో పోలిస్తే 1.25 శాతం వార్షిక వృద్ధి రేటుతో గత 16 ఏళ్లలో అదనంగా మరో 70 లక్షల మంది జనాభా పెరిగినట్లు అంచనాకు వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకూ ఉన్న మొత్తం పాత గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా అవలీలగా కోటిన్నర దాటవచ్చని భావిస్తున్నారు. 2011లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల జనాభాను చూస్తే 92 లక్షలుగా ఉంది. 2010-11 లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉంటే, తాజా గణన ప్రకారం కోటీ 20 లక్షలకు పెరిగినట్లు అంచనా.
ప్రస్తుతం జనాభా లెక్కల సేకరణ మొత్తం రెండు ఫేజ్‌లుగా జరుగుతుంది. మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కట్టడం, ఇల్లు, అందులో ఉన్న మౌలిక సదుపాయాలు, కుటుంబ పెద్ద పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య వివరాలను సేకరించారు. గత నెల రోజుల్లో 80 వేల మంది ఉద్యోగులు ఈ పని చేసి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. రెండో దశ జనగణన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. అప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. ఆ తర్వాత రెండు దశల వివరాలన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం జనాభా ఎంత అనే విషయాలను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. 2027 ఆఖరుకు లేదా 2028 ఆరంభానికల్లా అధికారికంగా జనాభా వివరాలను వెల్లడించే అవకాశాలున్నాయి.
మొదటి దశ జనగణన మే 11న ప్రారంభమైంది. జూన్ 9 వరకు ఇళ్ల సంఖ్య తదితర వివరాలను నమోదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 300 డివిజన్లను యూనిట్‌గా తీసుకుని హైదరాబాద్ మహానగరంలో జనాభా సంఖ్యను లెక్కించారు. మొత్తం 20 వేల హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించి ఇంటింటికీ సర్వే చేశారు. ఒక ప్రాథమిక అంచనాగా భాగ్యనగరంలో 45 లక్షల ఇళ్లు ఉండవచ్చని అంచనా. వాటిలో కోటిన్నర వరకు జనాభా ఉంటుందని మాత్రం అధికారులు భావిస్తున్నారు. ఒక కుటుంబం వివరాలను రెండుసార్లు నమోదు చేయడం, సంబంధించిన విషయాలను తప్పులుగా రాయడం వంటివి సరిచేస్తే జనాభా సంఖ్యలో మార్పులు సంభవిస్తాయి. ఫిబ్రవరి 2027లో జరగబోయే రెండో దశ జనగణనలో జనాభా లెక్కలపై స్పష్టమైన వివరాలు, సంఖ్య తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.