ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని అమలు చేస్తోంది. ఉత్తరాంధ్ర
, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడి పరిస్థితులకు అనుకూలంగా పరిశ్రమలు, కంపెనీలను తీసుకొస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాకు ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, ఫార్మా పరిశ్రమలు వస్తున్నాయి. కోస్తా జిల్లాలలో సోలార్ ప్లాంట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమలు, పర్యాటక రంగ అనుబంధ హోటల్స్, పోర్టుల్ని అభివృద్ధి చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో సోలార్ ప్లాంట్లు, డ్రోన్ సిటీ, డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు, సెమీ కండక్టర్ పరిశ్రమల్ని తీసుకొస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమలో కరువు జిల్లాగా పిలిచే ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇప్పటికే ఆటోమొబైల్, టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రాగా.. కొంతకాలంగా ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తున్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటకను కాదని పుట్టపర్తి, హిందూపురం సహా పలు కీలక ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయి.కర్ణాటకను కాదని ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి అనంతపురం జిల్లా కర్ణాటకకు సరిహద్దులో ఉంది.. అక్కడితో పోలిస్తే అనంతపురం జిల్లాలో భూముల లభ్యత బావుంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అందిస్తున్న ప్రోత్సాహకాలు కూడా కలిసొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడం ప్లస్ పాయింట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనంతపురం జిల్లా సరిహద్దు నుంచి దగ్గరగా ఉంది.. కేవలం రెండు, మూడు గంటలు ప్రయాణం ఉంటుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి హిందూపురం, పుట్టపర్తి జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు. అంతేకాదు పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉండటం కూడా కలిసొస్తుంది.. ఇటు రోడ్డు, రైలు సౌకర్యాలు ఉండటం సానుకూలంగా మారింది. అందుకే పారిశ్రామికవేత్తలు పొరుగునే ఉన్న కర్ణాటక కాకుండా సమీంలోనే ఉన్న అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు.ఏపీ ప్రభుత్వం ముందుగానే ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూముల్ని గుర్తించి పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తోంది. అందుకే పారిశ్రామికవేత్తలు అనంతపురం జిల్లావైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిశ్రమల కోసం వేల ఎకరాల ప్రభుత్వ, బంజరు భూముల్ని గుర్తించారు. పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వం లేపాక్షి, మడకశిర పరిసరాల్లో వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. కర్ణాటకతో పోలిస్తే ఇక్కడ భూముల ధరలు చాలా తక్కువ కావడంతో అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. గతేడాది బెంగళూరులో ఉన్న ఐటీ కంపెనీ సీఈవో కష్టాలు చెప్పుకుంటూ ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. ఏపీకి రమ్మని ఆహ్వానించారు. ఆ తర్వాత మంత్రి లోకేష్ అనంతపురాన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా పేర్కొన్నారు. ఏరోస్పేస్, ఇతర పరిశ్రమలకు ఏపీలో 8వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందంటూ ఆహ్వానం పలికారు. లోకేష్ ఇచ్చిన పిలుపు కూడా పరిశ్రమల రాకకు ఓ కారణంగా చెప్పొచ్చు.ఇప్పటికే ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు.. సోలార్, డ్రోన్ పరిశ్రమలు రాగా.. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఈ ప్రాంతానికి మరింత బూస్టప్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది.. రాబోయే రోజుల్లో మరికొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో ఉద్యోగాలు, ఉపాధి కోసం బెంగళూరు, కర్ణాటక వెళ్లిన జిల్లా ప్రజలకు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా జిల్లాకు వరుసగా పరిశ్రమల రాకతో మరికొన్ని ఉద్యోగ, ఉపాది అవకాశాలు దక్కుతాయంటున్నారు. ఇక జిల్లావాసులు ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు.ఉమ్మడి అనంతపురం జిల్లా భారీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. పెనుకొండలో కియా మోటార్స్ కార్ల తయారీ ప్లాంట్ ఉంది. కియాకు అనుబంధంగా మరికొన్ని అంతర్జాతీయ విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) కంపెనీలు ఏర్పాటయ్యాయి. రాప్తాడు దగ్గర రేమండ్ గ్రూప్ రూ. 1,200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోంది. హిందూపురం, పెనుకొండ ప్రాంతంలో ప్రముఖ ఇన్నర్ వేర్ బ్రాండ్ అయిన జాకీ తయారీ యూనిట్ వచ్చింది. సరళా ఏవియేషన్ రూ. 1300 కోట్లతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (eVTOL) విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే రక్షణ, విమాన పరికారల తయారీకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. గిన్ఫ్రా ప్రెసిషన్స్ రూ. 1,150 కోట్ల పెట్టుబడితో బైమాడ్యులర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను తిమ్మసముద్రంలో ఏర్పాటు చేస్తోంది. అలాగే హిందూపురం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆర్జాస్ స్టీల్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. పుట్టపర్తి సమీపంలో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ భారీ సెమీకండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేస్తోంది.పుట్టపర్తి సమీపంలో డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్ క్లస్టర్లు వస్తున్నాయి. గత నెలలోనే పుట్టపర్తిలో కేంద్ర ప్రభుత్వం ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. రూ. 15,803 కోట్లతో యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం 600 ఎకరాలను కేటాయించింది. ఈ స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు రూ. లక్ష కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా రాబోయే రోజుల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని చెబుతున్నారు.