
'ఏపీ లిక్కర్ స్కామ్' కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుకు ముందు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ
ఏకకాలంలో భారీ దాడులు నిర్వహించింది. రాజ్ కెసిరెడ్డితో పాటు మరో ఆరుగురు కీలక వ్యక్తుల నివాసాల్లో సోదాలు చేసింది. వీటిలో ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి. వాసుదేవ రెడ్డి, ఆయన బంధువు నరసింహారెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులకు చెందిన కార్యాలయాలు, నివాస ప్రాంగణాలు ఉన్నాయి.
ఈ స్కామ్‌కు సంబంధించి ఈడీ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) లో మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. డిస్టిలరీలు, మద్యం సరఫరాదారుల నుంచి వేల కోట్ల రూపాయలను లంచాల రూపంలో అక్రమంగా వసూలు చేశారని ఈడీ స్పష్టం చేసింది.
దాదాపు రూ.3,200 కోట్ల రూపాయలను లంచాల రూపంలో వసూలు చేసి, వాటిని పట్టుబడకుండా ఉండేందుకు పలు నకిలీ, షెల్ కంపెనీల ద్వారా చేతులు మార్చారని ఈడీ గుర్తించింది. ఈ మద్యం సిండికేట్ వెనుక ఉన్న అసలు దొంగలు ఎవరు? ఈ వేల కోట్ల రూపాయల హవాలా డబ్బు చివరికి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది? అనే కోణంలో ఈడీ విచారణను మరింత వేగవంతం చేసింది.