
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), షర్మిల (Sharmila) శవ రాజకీయాలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav)ధ్వజమెత్తారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు విస్తృతమైన కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. తిరుపతి వేదికగా జరగబోయే భారీ ఎన్డీఏ సభలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేతలు పాల్గొని కూటమి భవిష్యత్తు ప్రణాళికను వివరించనున్నారని తెలిపారు. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని, 2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Steel Plant) ఐరన్ ఓర్ ప్రమాదంలో కార్మికులు మరణించడం అత్యంత బాధాకరమని అన్నారు. జగన్ అక్కడకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. శవాలను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేయడం మానుకోవాలని హితవుపలికారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి, అది ప్రైవేటు పరం కాకుండా ఆపింది తామేనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా నేనే చేశాను అని జగన్ ఎలా చెప్పుకుంటారు? అని ప్రశ్నించారు.