
ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy)ని ఈడీ (ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మనీలాండరింగ్
, హవాలా జరిగినట్లు గుర్తించిన ఈడీ, విచారణను మరింత వేగవంతం చేసింది. హైదరాబాద్ (Hyderabad)తో పాటు పది చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు మరికొందరు అనుమానితుల ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఈడీ అదుపులోకి తీసుకుంది. లిక్కర్ స్కామ్, మద్యం రవాణా కేసుల్లో రాజ్ కసిరెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో పలు కంపెనీలతో పాటు కార్పొరేట్ కార్యాలయాల్లోనూ గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో లభించిన సమాచారం, గతంలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించింది.