
ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు భీష్మాచార్యుడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘సింగ్
గీతం’ (SingGeetham). నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి (Chiranjeevi) పోస్ట్ పెట్టారు.
‘‘సింగీతం శ్రీనివాసరావు.. తెలుగు సినిమా పరిశ్రమకు ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో రూపొందిన ‘సింగ్ గీతం’ ఈనెల 12న విడుదల కానుంది. ఇది ఇండియన్ సినిమాలో మరొక మైలురాయిగా నిలవాలని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్తతరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నాగ్ అశ్విన్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకవైపు ఆనాటితరానికి ప్రతినిధిగా నిలిచిన సింగీతం (Singeetham SrinivasaRao), మరోవైపు ఈతరం ఆలోచనలను ప్రతిబింబించే నాగ్ అశ్విన్.. వీరి కాంబో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది’’ అని చిరంజీవి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఇందులోభాగమైన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘సింగ్‌గీతం’. ఇది ఓ గ్రామంలోని ప్రజలకు ఎదురైన వింత సమస్య చుట్టూ తిరిగే కథ. కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత ఆ ఊరి వాసుల సాధారణ మాటలన్నీ పాటలుగా మారిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్థుల గందరగోళాన్ని.. తమ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నాల్ని ఇందులో వినోదాత్మకంగా ఆవిష్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.