మరో 24 గంటల్లో ప్రారంభం కానున్న ఫీఫా ప్రపంచ కప్ 2026ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా, లియోనెల్ మెస్సీతో పాటు ఆయన అర్జెంటీనా సహచరుల పాస్‌పోర్ట్ డేటా లీక్ అయ్యింది. మంగళవారం ఐస్‌లాండ్‌తో
జరిగిన ప్రపంచ కప్‌కు ముందు వార్మప్ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టులోని లియోనెల్ మెస్సీతో సహా ప్రతి ఆటగాడి పాస్‌పోర్ట్ వివరాలు, ఒక భద్రతా లోపం కారణంగా లీక్ అయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అధికారిక జట్టు జాబితాలో ఉన్న పాస్‌పోర్ట్ నంబర్లు, మీడియా, ప్రజలకు విడుదల చేసే ముందు వాటిని బ్లర్ చేయాల్సి ఉంది. కానీ అలబామాలోని జోర్డాన్-హేర్ స్టేడియంలో వాటిని ఎటువంటి మార్పులు చేయకుండానే విడుదల చేశారు.కానీ, ఐస్లాండ్ ఆటగాళ్లు తమ పాస్‌పోర్ట్ వివరాలను సమర్పించకపోవడంతో అవి బయటకు రాలేదు. దీనిపై స్పందించాల్సింగా అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫెడరేషన్, ఫీఫాను రాయిటర్స్ సంప్రదించింది. ఫిఫా ప్రపంచకప్‌ను చుట్టుముట్టిన వివాదాల్లో ఇది తాజాది. ప్రపంచకప్‌లో పాల్గొనడానికి వచ్చిన సెనెగల్ ఆటగాళ్లను అమెరికాలోని విమానాశ్రయంలో మితిమీరిన భద్రతా తనిఖీలకు గురిచేశారంటూ వచ్చిన ఒక వీడియో తీవ్ర కలకలం రేపింది. సాడియో మానే, కాలిడౌ కౌలిబాలీ వంటి సూపర్ స్టార్స్ ఉన్న ఈ సెనెగల్ జట్టు... విమానం దిగిన తర్వాత శాన్ ఆంటోనియోలోని ఎయిర్పోర్ట్ టార్మాక్‌పైనే మెటల్ డిటెక్టర్లతో భద్రతా తనిఖీలు చేయించుకుంటుండగా ఎవరో వీడియో తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్పెయిన్ వంటి జట్లకు ఇలాంటి కఠినమైన తనిఖీలు చేయలేదని, కేవలం సెనెగల్ జట్టుకే ఎందుకు చేశారని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. న్యూయార్క్‌లో ఉజ్బెకిస్థాన్ జట్టుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందని మరికొందరు ఆరోపించారు. మరోవైపు, అమెరికాలో ప్రవేశానికి అనుమతించకపోవడంతో సోమాలియాకు చెందిన ప్రపంచకప్ రెఫరీ ఒకరు బుధవారం తన దేశానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు మద్దతుదారులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తదుపరి ప్రపంచకప్‌లో తాను భాగం కావాలని కోరుకుంటోన్నానని, సోమాలియా యువత తమ దేశాన్ని చూసి గర్వపడాలని పిలుపునిచ్చారు.టోర్నమెంట్ కోసం ఫీఫా తుది జాబితాలో చోటు దక్కించుకున్న తర్వాత ఒమర్ అర్తాన్ ప్రపంచ కప్‌లో అధికారికంగా వ్యవహరించనున్న సోమాలియాకు చెందిన మొదటి రిఫరీ కానున్నారు. ఆఫ్రికాలోని అగ్రశ్రేణి రిఫరీలలో ఒకరైన ఆయన.. 2025లో ఆ ఖండంలోని ఉత్తమ పురుష రిఫరీగా ఎంపికయ్యారు. శనివారం మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అతడ్ని అడ్డుకోవడంపై అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్పందించింది. భద్రతాపరమైన ఆందోళన కారణంగా అనుమతించలేదని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆయన టోర్నమెంట్ రిఫరీల జాబితా నుంచి ఫీఫా తొలగించింది.గత వారం అర్తాన్‌కు అమెరికా పర్యటనకు వీసా జారీ అయిందని, దానిని ప్రాసెస్ చేసిన కెన్యాలోని సోమాలియా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. మియామిలోని వారి శిక్షణా కేంద్రంలో ఇతర ప్రపంచ కప్ రిఫరీలను అర్తాన్ కలవాల్సి ఉంది.