
చాట్ బండి వద్దకు వెళ్లి.. సమోసా, కచోరీ, వడాపావ్.. ఇలా ఏది పార్శిల్ కట్టమన్నా, సర్వ్ చేయమన్నా వాటిని న్యూస్ పేపర్లలో ఇవ్వడం చూస్తుంటాం. అంతెందుకు.. మన ఇంట్లో తయారుచేసుకునే పూరీలపై నుంచి అదనపు
నూనెను తొలగించాలన్నా వాడేది న్యూస్ పేపరే.
చాట్ బండి వద్దకు వెళ్లి.. సమోసా, కచోరీ, వడాపావ్.. ఇలా ఏది పార్శిల్ కట్టమన్నా, సర్వ్ చేయమన్నా వాటిని న్యూస్ పేపర్లలో ఇవ్వడం చూస్తుంటాం.
అంతెందుకు.. మన ఇంట్లో తయారుచేసుకునే పూరీలపై నుంచి అదనపు నూనెను తొలగించాలన్నా వాడేది న్యూస్ పేపరే.
ఇక పొడి ఆహార పదార్థాల్ని న్యూస్ పేపర్లోనే చుట్టి పట్టుకెళ్లడం మనలో చాలామందికి అలవాటే!
ఇలా ఆహార ప్యాకింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది వార్తాపత్రికలే. కానీ ఈ అలవాటును పూర్తిగా మానుకోమని హెచ్చరిస్తోంది ‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI)’. ముంబయిలోని వీధి వ్యాపారులు ఫుడ్ ప్యాకింగ్ కోసం వార్తా పత్రికల్ని ఎక్కువగా వాడుతున్ననేపథ్యంలో.. వీటిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్యాకింగ్ కోసం పేపర్ ఉపయోగించడంపై తాజాగా నిషేధం విధించిందీ సంస్థ. ఈ తరహా ప్యాకింగ్ వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లడమే ఇందుకు కారణమని పేర్కొంది. మరి, ఇంతకీ ఆహారాన్ని న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలొస్తాయి? దీనికి ప్రత్యామ్నాయ మార్గాలేవైనా ఉన్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..
‘ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, నూనె పదార్థాల్ని న్యూస్ పేపర్లలో చుట్టడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ వార్తా పత్రికల ప్రింటింగ్ ఇంక్‌లో విషపూరిత రసాయనాలు, లెడ్/క్రోమియం/కాడ్మియం.. వంటి లోహాలు మిళితమై ఉంటాయి. వేడి పదార్థాలు, నూనె పదార్థాలు ఈ ఇంక్‌తో కలవడం వల్ల ఆయా రసాయనాలు ఆహారంలోకి విడుదలవుతాయి.. ఇలా కలుషితమైన ఆహారాన్ని తినడం ప్రమాదకరం..’ అన్న సందేశంతో కూడిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిందీ ఆహార భద్రతా సంస్థ. ఈ క్రమంలో ఈ విధంగా ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు.
⚛ న్యూస్‌పేపర్ ఇంక్‌లో ఉండే హానికారక రసాయనాలు, రంగులు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. ఫలితంగా నెలసరి అదుపు తప్పడం, పీఎంఓఎస్, సంతానలేమి, చిన్న వయసులోనే రజస్వల కావడం.. వంటి సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు.
⚛ గర్భిణులు ఈ తరహా ప్యాకింగ్ ఆహారం తీసుకుంటే.. పుట్టబోయే బిడ్డలో అవకరాలు, నెలలు నిండకముందే ప్రసవం కావడం, శిశువులు తక్కువ బరువుతో జన్మించడం.. వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉందంటున్నారు.
⚛ న్యూస్పేపర్లలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్ని తరచుగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో.. రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు.
⚛ వార్తా పత్రికలు ఎంతోమంది చేతులు మారుతుంటాయి. అపరిశుభ్రమైన ఉపరితలం పైనా వీటిని పడేస్తుంటారు. ఇలాంటి పేపర్లను ఫుడ్ ప్యాకేజింగ్ కోసం వాడితే.. వాటిపై ఉండే బ్యాక్టీరియా ఆహారంలోకి చేరుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
⚛ న్యూస్పేపర్ల ఇంక్‌లోని హానికారక రసాయనాలు, కృత్రిమ రంగులు రోగనిరోధక వ్యవస్థ పనితీరునూ దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంటుందంటున్నారు.
⚛ ఈ అలవాటు అటు నాడీ వ్యవస్థ, ఇటు మూత్రపిండాల పనితీరు పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందట!
ఫుడ్ ప్యాకింగ్, ర్యాపింగ్ కోసం వార్తా పత్రికల్ని వాడి లేని ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకోవడం కంటే.. దీనికోసం కొన్ని ప్రత్యామ్నాయాల్ని పాటించడం మేలంటున్నారు నిపుణులు.
⚛ అరటి, అరేకా పామ్.. వంటి ఆకులతో తయారుచేసిన పర్యావరణహితమైన ఉత్పత్తులను ప్యాకింగ్ కోసం ఉపయోగించచ్చు. ఇవి సురక్షితమైనవని, వేడి పదార్థాల్ని వీటిలో ప్యాక్ చేసినా సమస్య ఉండదంటున్నారు.
⚛ నూనె, తడి ఆహార పదార్థాల కోసం బటర్ పేపర్, ఫుడ్ గ్రేడ్ ర్యాపింగ్ పేపర్.. వంటివి మార్కెట్లో దొరుకుతాయి. వాటిని ఉపయోగించచ్చు. ఇక పొడి పదార్థాల కోసం బ్రౌన్ క్రాఫ్ట్ పేపర్ మేలంటున్నారు.
⚛ కార్న్ స్టార్చ్‌తో తయారుచేసిన ఫుడ్ ప్యాకేజింగ్ బాక్సులు; చెరుకు పిప్పితో తయారుచేసిన ప్లేట్లు, గ్లాసులు; వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తయారుచేసిన బాక్సులు.. వంటివి కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ప్యాకింగ్ ప్రత్యామ్నాయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఆయా ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసం ఆరోగ్యకరమైన ప్యాకింగ్ మెటీరియల్‌నే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బయటికెళ్లినప్పుడు ఆయా ఫుడ్ సర్వింగ్, ప్యాకింగ్ కట్లరీని వెంట ఉంచుకుంటే మరీ మంచిది. ఆయా దుకాణాలలో ఇవి లేకపోయినా.. మన దగ్గర ఉన్నవి వాడుకోవచ్చు. తద్వారా ఆరోగ్యానికి నష్టం వాటిల్లకుండానూ జాగ్రత్తపడచ్చు.. అని చెబుతున్నారు. వింటున్నారా మరి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.