ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీలో కంటే తెలంగాణ రాజకీయాల్లోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో
విమర్శలు గుప్పిస్తుండగా.. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ నేతలు.. కౌంటర్లు ఇస్తుండటంతో.. మాటల యుద్ధం నెలకొంది. ఇటీవల హైదరాబాద్‌లో జనసేన సభకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రారంభమైన ఈ రగడ.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. మరోసారి ఆ వివాదంపై స్పందించారు. తాను తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా అంటూ ప్రశ్నించారు. జనసేన పార్టీని స్థాపించిందే తెలంగాణలో అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీకి నాయకులు ఉన్నారని.. కేడర్ కూడా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో లక్షన్నర మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారని.. వాళ్లు ఉత్సాహంగా ఉన్నప్పుడు.. వారి కోసం పనిచేయొద్దా అని ప్రశ్నించారు. తాను తెలంగాణ రాష్ట్ర విభజనకు వ్యతిరేకం కాదని.. విభజించిన తీరును వ్యతిరేకించినట్లు ఇప్పటికే చాలాసార్లు చెప్పానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలోకి తనను అడుగుపెట్టనివ్వను అని అనడం తన ప్రాథమిక హక్కుకి భంగం కలిగించినట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ ఇలా మాట్లాడలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు ప్రారంభం అయ్యాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 13 నెలలుగా తనను పర్సనల్‌గా టార్గెట్ చేస్తే.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని అనడం తప్పా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.ఈ క్రమంలోనే ఉత్తర, దక్షిణ అనే భావన సరికాదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి భావన పెరిగితే దేశానికి ప్రమాదకరం అని పేర్కొ్న్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే ఎక్కడైనా ఎవరైనా వాటిపై మాట్లాడొచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు ఉత్తర, దక్షిణ ప్రాంతాలు అనే వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. విభజనవాదం దేశానికి మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను హైదరాబాద్ రాకూడదని కొందరు నేతలు అన్నారని.. అలా అయితే దక్షిణాదితో రాహుల్ గాంధీకి సంబంధం లేదని చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ దేశం నాది అని.. ఎక్కడికైనా వెళ్లవచ్చనే ఉద్దేశంతోనే జాగీర్ అనే పదం ఉపయోగించినట్లు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.