
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చలామణీలో ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ఆర్బీఐ తీసుకురాబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది (Fact check). ఈ ఏడాది జూన్ 30 నుంచే ఈ
నోట్లు అందుబాటులోకి రానున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇవి పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ తీసుకొచ్చే అంశంపై ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది. కాబట్టి కరెన్సీ, బ్యాంకింగ్, ఆర్థికపరమైన అంశాల్లో అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని సూచించింది. ఇలాంటి సమాచారం ఇతరులతో పంచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకోవాలని పేర్కొంది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోందంటూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. లాభనష్టాలను బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు ప్లాస్టిక్ నోట్ల ప్రచారాన్ని అందుకోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.