తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. 'పవర్
స్టార్'గా టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా ఎదిగారు. కేవలం నటుడిగానే కాకుండా.. స్క్రీన్ ప్లే రైటర్‌గా, సింగర్ గా, స్టంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా మల్టీ టాలెంట్ చూపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పేరు వెనకున్న అసలు విషయాన్ని బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ పూర్తి పేరు 'కొణిదెల పవన్ కళ్యాణ్'. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు ఆయనకు ప్రేమతో 'పవర్ స్టార్' అనే ట్యాగ్ తగిలించారు. అయితే 'పవన్ కళ్యాణ్' అనేది తన అసలు పేరు కాదని జనసేనాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ''నాకు నామకరణం చేసినప్పుడు నాకు పెట్టిన పేరు ' శ్రీ కళ్యాణ్ కుమార్ '. స్కూల్ రికార్డ్స్ లో 'శ్రీ' ఎగిరిపోయింది. కె. కళ్యాణ్ కుమార్ అని రిజిస్టర్ చేశారు. సినిమాల్లోకి రాకముందు మా మార్షల్ ఆర్ట్స్ టీచర్ 'పవన్' అనే పదాన్ని నా పేరుకి ముందు యాడ్ చేశారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నప్పుడు, నేను ఎక్కువగా పవర్ డిమాన్స్ట్రేషన్ కు సంబంధించిన సాధనలు ఎక్కువగా చేసేవాడిని. నా గుండెలపై 450 కేజీల వరకూ బరువున్న స్టోన్స్ పగలగొట్టించుకున్నాను. అందుకే హనుమాన్ పవన పుత్ర అనే అర్థం వచ్చేలా మా మార్షల్ ఆర్ట్స్ గురువు 'పవన్' అనే పదాన్ని జోడించారు'' అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడి అసలు పేరు కాదని ఆయన తల్లి అంజనాదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'కళ్యాణ్ కుమార్' అని పేరు పెట్టామని, కానీ దాన్ని 'పవన్ కళ్యాణ్'గా మార్చుకున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ అనే పేరు తనకై తానే పెట్టుకున్నాడని అంజనమ్మ చెప్పారు. ఇన్నాళ్లకు 'పవన్' అనే పదం తన పేరులో ఎలా వచ్చింది, దాని వెనకున్న అసలు కథేంటి అనేది పవర్ స్టార్ వివరించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.