పవన్ కళ్యాణ్.. ఆ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లక్షలాది మందికి సుపరిచితమైన పేరు అది. పవర్ స్టార్ పవన్ కళ్యా్ణ్ అంటూ అభిమానులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ జనసైనికులు పిలుచుకునే పేరది
.. అయితే ఆ పేరు రావటం వెనుక గల ఆసక్తికర విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాన్ని తెలియజేశారు. నటుడిగా మారకముందే, మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందుతున్న రోజుల్లోనే తనకు ఈ పేరు ఎలా వచ్చిందో వివరించారు. చిన్నప్పుడు తనకు పెట్టిన పేరుకు పవన్ అనే పదం ఎలా జతకలిసింది.. అదే తన గుర్తింపుగా ఎలా మారిందనే సంగతి వివరించారు. తన నామకరణ వేడుకను గుర్తుచేసుకుంటూ, తిరుమల దేవస్థానంలోనే తనకు అసలు పేరు పెట్టారని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిన్నప్పుడు నామకరణం సమయంలో తనకు శ్రీ కళ్యాణ్ కుమార్ అనే పేరు పెట్టారని.. అయితే స్కూల్లో చేరిన సమయంలో రికార్డుల్లో శ్రీ అనే పదం తీసేశారని గుర్తు చేసుకున్నారు. తర్వాత కొణిదెల కళ్యాణ్ కుమార్‌గా తన పేరు మారిందన్నారు. " తిరుమల దేవస్థానంలో యోగ నరసింహస్వామి ఆలయంలో నాకు పేరు పెట్టారు. అయితే అది నా అసలు పేరు అని నేను అనుకోను. నామకరణం సమయంలో నాకు శ్రీ కళ్యాణ్ కుమార్ అనే పేరు పెట్టారు. స్కూల్ రికార్డుల్లో శ్రీ తీసేశారు. ఆ తర్వాత అది కాస్తా కె. కళ్యాణ్ కుమార్‌గా మారిపోయింది" అని చెప్పుకొచ్చారు. అలాగే తన పేరులోకి పవన్ అనే పదం ఎలా చేరిందనే సంగతిని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సమయంలో తన బలాన్ని చూసి ట్రైనర్లలో ఒకరు తనను హనుమంతుడితో పోల్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. "నేను సినీ ఇండస్ట్రీలోకి రాకముందు, అలాగే వచ్చిన తర్వాత, నా మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్లలో ఒకరు నా పేరుకు 'పవన్' అనే పదాన్ని జోడించారు.""ఆ సమయంలో నేను శారీరక బలాన్ని పెంచే శిక్షణతో పాటు మార్షల్ ఆర్ట్స్ సాధన ఎక్కువగా చేసేవాడిని. నా ఛాతీపై సుమారు 450 కిలోగ్రాముల బరువును ఉంచేవారు. అలాగే నా ఛాతీపై రాతి పలకలను కూడా పగలగొట్టేవారు. అప్పుడే నా ట్రైనర్లలో ఒకరు నువ్వు హనుమంతుడి వంటి వాడివి.. పవన పుత్ర హనుమాన్ అన్నారు. అదే నా పేరులో పవన్ చేరడానికి కారణమని అనుకుంటున్నా" అని పవన్ కళ్యాణ్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.