పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్థాన్ సైనిక హెలికాప్టర్ MI-17 సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో 21 మంది సైనికులు మృతిచెందినట్టు
తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. సాధారణ విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో నియంత్రణ కోల్పోయి ముజఫరాబాద్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఘటనపై విచారణకు పాకిస్థాన్ సైన్యం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుసుకోడానికి ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టనుంది. ప్రమాద సమయానికి హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేదు.జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)ను ఉగ్రవాద నిరోధక చట్టాల కింద స్థానిక ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో ఆందోళనలకు పిలుపునివ్వడంతో ముజఫరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పీఓకేలో గతవారం రోజుల నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ప్రకటించినా.. ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. పీఓకే ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ 14,000 మంది అదనపు భద్రతా సిబ్బందిని రంగంలోకి దించినట్లు నివేదికలు వస్తున్నాయి. జాక్ కీలక నేతలే లక్ష్యంగా హత్యలు, అర్ధరాత్రి నిర్బంధాలు వంటి చర్యలకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో సైనిక హెలికాప్టర్ కూలిపోవడం సంచలనంగా మారింది.30 మంది సైనికులను, 12 స్ట్రెచర్లను లేదా సుమారు 4,000 కిలోల బరువున్న సామాగ్రిని మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉన్న ఈ హెలికాప్టర్‌కు అమర్చిన బాహ్య స్లింగ్ మూడు టన్నుల వరకు బరువును ఎత్తడానికి వీలు కల్పిస్తుంది. ఇది రెండు క్లిమోవ్ TV3-117 ఇంజిన్ల ద్వారా శక్తిని పొందుతుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గతేడాది సెప్టెంబరులో గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని దియామెర్ జిల్లాలోని హుడోర్ సమీపంలో సాధారణ శిక్షణ సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తి ఎంఐ-17 హెలికాప్టర్ కూలిపోయి ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు.