
భారత్‌లో క్రెడిట్ కార్డులు ఉపయోగించేవారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అలాగని, అందరికీ క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించవు. మీకు క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు/తక్కువ ఉండొచ్చు
, ఆదాయం పరిమితంగా ఉండొచ్చు లేదా మీ ఉద్యోగ ప్రొఫైల్, ఇతర పరిమితుల కారణంగా విభిన్న పరిస్థితులు ఉండొచ్చు. ఈ కారణాల వల్ల మీరు సాధారణ క్రెడిట్ కార్డును పొందడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, క్రెడిట్‌ను ఉపయోగించుకోవాలనే మీ అవసరాలను సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు తీరుస్తాయి. బ్యాంకులు..ఫిక్స్డ్ డిపాజిట్ విలువకు బదులుగా దాదాపుగా అంతే పరిమితితో సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును అందిస్తాయి. సెక్యూర్డ్ కార్డ్‌లు ఎలా పని చేస్తాయి, వాటి ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డు..అనేక పరిస్థితుల్లో, ముఖ్యంగా ఆర్థిక నిర్వహణలో, తక్షణ క్రెడిట్‌ను అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, వాటిలో చాలా వరకు కార్డులు "అన్సెక్యూర్డ్" పరిధిలోకి వస్తాయి. అంటే, మీరు ఎటువంటి పూచీకత్తు లేకుండా క్రెడిట్ కార్డును పొందవచ్చు. అయితే, క్రెడిట్ కార్డు పొందడానికి మంచి క్రెడిట్ స్కోరు ఉండాలి. కానీ, కొందరికి మెరుగైన స్కోర్ ఉండకపోవచ్చు. ఆదాయ వనరులు లేని గృహిణులు, పదవీ విరమణ చేసినవారు, ఇప్పుడే సంపాదన మొదలయిన వారు సాధారణ క్రెడిట్ కార్డులు పొందడం కష్టమే. వీరు తక్షణం క్రెడిట్ కార్డు పొందాలనుకుంటే FD హామిగా ఉంచి 'సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు'ను పొందే అవకాశముంది.
బ్యాంకులు..ఈ క్రెడిట్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో క్రెడిట్ స్కోరు, ఆదాయ స్థాయి లేదా ఉద్యోగ ప్రొఫైల్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవు. ఎందుకంటే, ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ హామిగా ఉంటుంది. దీనివల్ల కార్డు జారీ చేసిన బ్యాంకుకు రిస్క్ ఉండదు. కార్డు వినియోగదారుడు తమ బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, కార్డును జారీచేసిన సంస్థ వాటిని వసూలు చేసేందుకు ఫిక్స్డ్ డిపాజిట్‌ను లిక్విడేట్ చేసే అవకాశం ఉంటుంది.
సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరచుకోవడానికి ఎంతగానో సహాయపడతాయి. మీకు అప్పటివరకు పేలవమైన లేదా తక్కువ క్రెడిట్ చరిత్ర ఉన్నట్లయితే, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును పొందిన తర్వాత మెరుగైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవడానికి అవకాశముంటుంది. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులతో జరిపిన లావాదేవీ వివరాలు కూడా క్రెడిట్ బ్యూరోలకు అందుతాయి. బ్యూరోలు మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కించడానికి ఈ డేటాను ఉపయోగిస్తాయి కాబట్టి, ఇది మీ విశ్వసనీయతను పెంచడంలోనూ సహాయపడుతుంది. సెక్యూర్డ్ కార్డులతో క్రెడిట్ స్కోరు పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో రుణాలు, ఇతర క్రెడిట్ ఎంపికలను పొందే అవకాశాలను పెంచుకోవచ్చు.
సాధారణంగా బ్యాంకు..సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు పరిమితిని, హామీ/సెక్యూరిటీగా ఉంచిన ఫిక్స్డ్ డిపాజిట్ విలువ ఆధారంగా నిర్ణయిస్తుంది. క్రెడిట్ కార్డు జారీచేసే సంస్థలు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తంపై 80-90 శాతం వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తాయి. అంతేకాకుండా, ఫిక్స్డ్ డిపాజిట్‌పై మెచ్యూరిటీ వరకు వడ్డీ వస్తుంది. దీనివల్ల సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుదారులు స్థిరమైన రాబడిని అందుకుంటూనే, క్రెడిట్ సదుపాయాన్ని కూడా పొందుతారు.
మీరు ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే మీ సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును కూడా స్వదేశంలో/విదేశంలో కొనుగోళ్లు, చెల్లింపులు చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా, మెరుగైన క్రెడిట్ హిస్టరీని పొందొచ్చు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డును తెలివిగా ఉపయోగిస్తే, కొంత కాలానికి అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డుకు అప్‌గ్రేడ్ కావచ్చు. అనేక కార్డు జారీదారులు అదనపు పూచీకత్తు(డిపాజిట్) అవసరం లేకుండా క్రెడిట్ పరిమితిని పెంచుతుంటారు. సెక్యూర్డ్ కార్డుదారుడు డిపాజిట్ హామిగా ఉన్న క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేయరు కాబట్టి, ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.