
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం
తిరస్కరించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ముందు బైఠాయించగా... తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అయితే, ఈ హైడ్రామా నడుస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ బీజేపీ కీలక మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ ఒక పొలిటికల్ బాంబు పేల్చారు. మీడియాతో మాట్లాడిన మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ.. "అసలు మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసులు ఉన్నాయనే విషయం మాకు ముందే తెలియదు. మాకు ఆ సమాచారం ఇచ్చింది, అక్కడి నుండి చిట్టీ పంపింది స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలే" అని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేసిన ఆయన.. సొంత పార్టీ నేతలే ఆమెపై ఉన్న కేసుల వివరాలను లీక్ చేశారంటే, ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలకే అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.