
భారతీరాజా.. భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు - ఆనందాలు, బాధలు - భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై
ఆవిష్కరించారు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మట్టివాసనతో నిండిన ఓ జీవనరాగంలా అనిపిస్తుంది. ప్రేమను కవిత్వంగా, బంధాలను హృద్యంగా, ప్రకృతిని పాత్రగా మలిచిన ఆయన చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అందుకే భారతీరాజా కేవలం ఒక దర్శకుడు కాదు... భావోద్వేగాలకు దృశ్యరూపమిచ్చిన ఓ గొప్ప కథకుడు. నేడు ఆయన భౌతికంగా దూరమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం.
1941 జులై 17న తేని జిల్లా అల్లి నగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి పెరియమాయ తేవర్. చిన్నప్పటినుంచే కళలపై ఆసక్తి ఉన్నప్పటికీ, సినిమా రంగంలోకి రావడం సులభం కాలేదు. కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కనగల్, పి.పుల్లయ్య వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసి సినిమాలో మెలకువలు నేర్చుకున్నారు. అలా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
1977లో వచ్చిన ‘16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది) సినిమాతో భారతీరాజా దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటివరకు కేవలం స్టూడియో సెట్టింగులకే పరిమితమైన తమిళ సినిమాను నిజమైన పల్లెటూరి లొకేషన్లలోకి తీసుకెళ్లి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఎలాంటి మేకప్ లేకుండా హీరోలను చూపించడం, ఎలాంటి అదనపు సొగసుల జోలికి వెళ్లకుండా సహజంగా ఉన్న అమ్మాయిలను హీరోయిన్లుగా పరిచయం చేయడంతో అప్పటి సినీ సంప్రదాయాలను తిరగరాశారు.
కేవలం గ్రామీణ చిత్రాలకే పరిమితం కాకుండా, ‘సిగప్పు రోజాక్కల్’ (తెలుగులో ఎర్ర గులాబీలు) వంటి సైకో థ్రిల్లర్ చిత్రాలతో తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ‘సీతాకోకచిలుక’ (1981) చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన తీసిన ‘వేదం పుదిదు’ సినిమా సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. రాధిక, రాధ, రేవతి, కార్తీక్, విజయశాంతి వంటి ఎందరో నటీనటులను ఆయనే వెండితెరకు పరిచయం చేశారు.
భారతీరాజా తన సినిమాల్లో ఎక్కువగా పల్లెటూరి కథలనే చూపించేవారు. మట్టివాసనను వెండితెర పైకి తెచ్చిన దర్శకుడిగా ఆయనకు పేరుంది. హీరోయిన్లను మేకప్ లేకుండా స్వచ్ఛంగా చూపించేవారు. దీని వెనుక కారణాన్ని ఆయన ఓ సందర్భంలో తనదైన చతురతను జోడించి చెప్పారు. ‘‘నేను ఒకమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటా. ఆశ్చర్యంగా ప్రతిసారీ ఆమె నాకు పల్లెల్లోనే కనిపిస్తోంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి ముగ్ధుడినయ్యా. అందుకే కెమెరా పట్టుకుని ఆ అందాన్ని వెతుక్కుంటా’’ అంటూ పల్లెలపై తన ప్రేమను వ్యక్తపర్చారు.
ఆయన కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా నటుడిగానూ అలరించారు. ‘ఆయుధ ఎళుతు’, ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), గతేడాది వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సిఉంది. ఇదే నటుడిగా ఆయనకు చివరి సినిమా.
భారతీరాజా తర్వాతితరం చిత్రనిర్మాతలకు శిక్షణ ఇవ్వడానికి ‘భారతీరాజా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సినిమా (BRIIC)’ని స్థాపించారు. అందులో ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు. ఎప్పుడు ఏ వేదిక పైకి వచ్చినా ‘నా ప్రియమైన తమిళ ప్రజలారా’ అంటూ పలకరించే ఆయనను కోల్పోవడంతో చిత్రసీమలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసినట్లైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.