
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు అందేలా కీలక నిర్ణయం తీసుకుంది. జీతాల చెల్లింపుల్లో తరచూ ఎదురవుతున్న ఆలస్యాలను నివారించేందుకు ఆర్థిక శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి నెల 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు హాజరు వివరాలను పరిగణనలోకి తీసుకుని వేతన బిల్లులు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ప్రతి నెల 25వ తేదీ లోపు వేతన బిల్లులను ట్రెజరీలకు పంపించాలని.. నెలాఖరు కల్లా వాటి పరిశీలన, ఆడిట్ ప్రక్రియలు పూర్తి చేయాలని ఆదేశించింది. పరిపాలనా నిర్లక్ష్యం కారణంగా జీతాల చెల్లింపులు ఆలస్యమైతే సంబంధిత శాఖాధిపతులు, డీడీఓలపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
మరోవైపు విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల్లో ఈ-కుబేర్ విధానం ద్వారా జీతాల చెల్లింపులను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గెజిటెడ్ అధికారులు లేని చోట ప్రభుత్వ గెజిటెడ్ అధికారులకు లేదా ప్రత్యేక అనుమతితో సంస్థల సీనియర్ అధికారులకు డీడీఓ అధికారాలు అప్పగించే అవకాశం కల్పించింది. ఈ ఉత్తర్వుల అమలును పర్యవేక్షించే బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్‌కు అప్పగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.