తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ కు షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ కోసం ఆమె దాఖలు చేసిన నామినేషన్‌ను స్క్రూట్నీలో తిరస్కరణకు
గురైంది. ఆస్తుల వివరాలను, తెలంగాణలో తనపై ఉన్న క్రిమినల్ కేసులను అఫిడ్‌విట్‌లో మీనాక్షి నటరాజన్ వెల్లడించలేదని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి మంగళవారం తిరస్కరించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ స్పందించారు. దీనిని తాము కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఓటమికి భయపడి నామినేషన్ తిరస్కరించారని, నోటీసు ఇస్తే సమాధానం ఇచ్చేవాళ్లమని అన్నారు.ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. మధ్యప్రదేశ్‌లోని మూడు స్థానాల్లో రెండు బీజేపీకి, ఒకటి ప్రతిపక్ష కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. అందుకే మూడో స్థానానికి సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ పోటీలో దిపింది. కానీ, సంఖ్యా బలం లేనప్పటికీ బీజేపీ మూడో అభ్యర్థిని పోటీకి నిలపడం గమనార్హం. రెండు స్థానాలకు తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్ పేర్లను శనివారం ప్రకటించింది. సోమవారం చివరి రోజున కేవత్‌ను నామినేషన్ సమర్పించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలకు గాను బీజేపీకి 164, కాంగ్రెస్‌కు 62 మంది ఉన్నారు. సాంకేతిక కారణాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు అనర్హులయ్యారు. రాజ్యసభకు పోటీచేసే ప్రతి అభ్యర్థి 58 ఓట్లను కచ్చితంగా సాధించాలి. ఆ లెక్కన బీజేపీ 116 ఓట్లతో రెండు సీట్లను సులువుగా గెలుస్తుంది. ఇంకా ఆ పార్టీకి 48 ఓట్లు మిగులుతాయి. మూడో సీటు దక్కించుకోవాలంటే మరో 10 ఓట్లు సంపాదించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం ఆసక్తికరంగా మారింది.