తమిళనాడులో శాంతి భద్రతలపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ.. మహిళలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా సీఎం విజయ్ కీలక ముందడుగు వేశారు. సెంగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తమిళనాడు
సీఎంగా ప్రమాణం చేసిన సరిగ్గా నెల రోజులకు విజయ్ ఈ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించడం విశేషం. స్త్రీలు, బాలికల భద్రత కోసం ఈ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగం పని చేస్తుంది. సింగప్పెన్ అంటే తమిళంలో సింహం లాంటి అమ్మాయి అని అర్థం. ఈ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్ నుంచి ఐజీ స్థాయి వరకు అందరూ మహిళా పోలీసులే ఉంటారు. ఈ విభాగంలో పని చేసే వారికి మార్షల్ ఆర్ట్స్‌తోపాటు ఆయుధాల వినియోగం, బైక్ నడపడంపై శిక్షణ ఇస్తారు.మహిళలపై వేధింపులు జరిగే కాలేజీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు లాంటి రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా నేరాలు జరగకుండా ఈ టాస్క్‌ఫోర్స్ చూస్తుంది. ప్రత్యేకమైన యూనిఫామ్‌లో సింగప్పెన్ మహిళా పోలీసులు బైకులపై రోడ్ల మీద తిరుగుతుంటారు. దీని వల్ల ఆకతాయిలు భయపడతారు. మహిళలు స్వేచ్ఛగా సంచరించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు మఫ్టీలో సాధారణ మహిళల్లా తిరుగుతూ ఆకతాయిల ఆట కట్టిస్తారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో పని చేసే వారికి బాడీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలను అందిస్తారు. మహిళా హెల్ప్ లైన్ నంబర్లు లేదా అత్యవసర కాల్ నంబర్‌కు వచ్చే కాల్స్‌ను ఈ టాస్కోఫోర్స్ కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంది.సింగప్పెన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘ఈ టాస్క్‌ఫోర్స్ నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. తమిళనాడులోని ప్రతి కుటుంబాన్ని రక్షించాలనే ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. మహిళల రక్షణకు, మన కుటుంబాల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఇది కేవలం ఎన్నికల హామీ కాదు.. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించడం ద్వారా కీలక ముందడుగు వేశాం. డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ అనే మూడు అంశాలపై మా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. తమిళనాడును పూర్తిగా డ్రగ్స్ రహితంగా మార్చాలి. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోవాలని మేం అనుకోవడం లేదు. సురక్షిత భవిష్యత్తును అందించడంపైనే మా ఫోకస్ ఉంది. మహిళలపై నేరాలను ఏమాత్రం సహించబోం. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం. ఆ శిక్షలు చూశాక, నేరాలు చేయాలంటే ఇతరులు భయపడేలా చేస్తాం’ అని విజయ్ వ్యాఖ్యానించారు.హైదరాబాద్ శివార్లలో ‘దిశ’ ఘటన జరిగిన తర్వాత ఏపీలో ఆ సమయంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారు మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకొచ్చి.. రాష్ట్రవ్యాప్తంగా దిశ పేరిట మహిళా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దిశ యాప్‌ను సైతం నాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే లేదా ఫోన్‌ను గట్టిగా ఊపితే బాధితురాలి లైవ్ లొకేషన్ సమీపంలోని దిశ పోలీసు స్టేషన్‌కు, కంట్రోల్ రూమ్‌కు చేరేలా రూపకల్పన చేశారు. తమిళనాడులోని విజయ్ సర్కారు తీసుకొచ్చిన సింగప్పెన్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కూడా ఇదే తరహాలో ఉంటుంది. మహిళలపై నేరాలు జరగకుండా చూసే విషయంలో దిశతో పోలిస్తే ఈ టాస్క్‌ఫోర్స్‌ను కొంత మెరుగుపర్చారు.