
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల ఆలస్యానికి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్, జూన్ 9
(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులో జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాల ఆలస్యానికి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ఆర్థిక శాఖ కీలక సర్క్యులర్ జారీ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, హానరేరియం ఉద్యోగులందరికీ 1వ తేదీన వేతనాలు వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆలస్యమైతే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, డీడీఓలదే బాధ్యతని తెలిపారు. ప్రతి నెల 25వ తేదీలోపు జీతాల బిల్లులు ట్రెజరీకి సమర్పించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెలాఖరులోపు బిల్లుల స్క్రూటినీ, ఆడిట్, అథరైజేషన్ పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి హుకుం జారీ చేశారు. బడ్జెట్ కొరత లేదా సాంకేతిక సమస్యలు ఉంటే ముందుగానే ఫైనాన్స్ శాఖకు తెలియజేయాలని సూచించారు. జీతాల చెల్లింపులో పరిపాలనా నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరిచారు. అన్నిశాఖలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు ఉత్తర్వులు ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీన జీతం చేరేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మేరకు ఫైనాన్స్ శాఖ కార్యదర్శి డా. గౌరవ్ ఉప్పల్‌కు సమన్వయ బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు.