ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మనదేశంలోనే ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ మజ్గావ్ డాక్ లిమిటెడ్ (MDL) ఏపీలో పెట్టుబడులు
పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఆ రాష్ట్రానికి గతంలో ప్రతిపాదనలు చేసింది ఎండీఎల్. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవటంతో.. ఇప్పుడు ఏపీవైపు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. తూత్తుకుడిలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ప్రాజెక్టు కోసం 2025 సెప్టెంబర్ నెలలో మజ్గావ్ డాక్ లిమిటెడ్ తమిళనాడు ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల సమీక్షా సమావేశంలో బోర్డు ఆమోదం తర్వాత, ఈ ప్రాజెక్ట్ కోసం రూ.15 వేలకోట్ల నుంచి రూ.18 వేలకోట్ల వరకూ పెట్టుబడులు పెడతామని ఎండీఎల్ సంస్థ ప్రకటించింది.3,00,000 DWT సామర్థ్యంతో.. అతిపెద్ద ముడి చమురు రవాణా నౌకల అవసరాలను తీర్చే ఉద్దేశంతో.. 1,050 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్‌ను పది నుంచి 12 ఏళ్లలో అభివృద్ధి చేసే ప్రణాళికకు ఆమోదం తెలిపింది. అయితే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ క్లస్టర్ ప్రాజెక్టు కోసం తమిళనాడు ప్రభుత్వం ఒక విదేశీ కంపెనీని తీసుకువచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మజ్గావ్ డాక్ లిమిటెడ్ తనకు ఉన్న ప్రత్యా్మ్నాయ మార్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనేఆంధ్రప్రదేశ్లో భారీ నౌకా నిర్మాణ క్లస్టర్ ఏర్పాటు కోసం రూ.29,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ఎండీఎల్ యోచిస్తోంది. ఇందులో భాగంగా సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపేందుకు ఎండీఎల్ బృందం త్వరలోనే ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఏం జరిగిందంటే.. 2025 సెప్టెంబర్ 19న.. తూర్పు తీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంవోయూ చేసుకుంది. తూత్తుకుడిలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డులు ఏర్పాటు చేసేందుకు ఎండీఎల్‌తో పాటుగా కొచ్చిన్ షిప్ యార్డు కూడా తమిళనాడు ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. రెండూ కలిసి రూ.30 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇక గతేడాది నవంబర్ నెలలో జరిగిన బోర్డు సమావేశంలో తూత్తుకుడిలో రూ.15000 వేలకోట్లు నుంచి రూ.18 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎండీఎల్ ప్రకటించింది. అప్పటి నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ కోసం ఎదురుచూస్తోంది. అయితే గతేడాది ఆఖర్లో జరిగిన తమిళనాడు రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్‌లో HD Hyundai అనే విదేశీ కంపెనీ తూత్తుకుడిలో షిప్ యార్డ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వంతో ఎక్స్ క్లూజివ్ బిజినెస్ కోపరేషన్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. దీంతో మజ్గావ్ డాక్ ప్రత్యామ్నాయంగా ఏపీవైపు దృష్టి సారించినట్లు సమాచారం.