పశ్చిమాసియా యుద్ధ ప్రభావం స్కూల్ విద్యార్థులపైనా పడుతోంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ
నేపథ్యంలోనే పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోలు, ప్రైవేటు కార్లు కూడా ధరలు పెంచేస్తున్నాయి. ఇక త్వరలోనే స్కూళ్లు ప్రారంభం కానుండగా.. విద్యార్థుల ట్రాన్స్పోర్ట్ ఫీజులను ఆయా వాహనదారులు పెంచేస్తున్నారు. దీంతో స్కూల్ పిల్లల తల్లిదండ్రులకు ఈ పెంపు కూడా అదనపు ఆర్థిక భారంగా మారుతోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు హైదరాబాద్‌లో స్కూల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరగడంతో.. ఆటో డ్రైవర్లు, ప్రైవేటు కార్లు ఒక్కో విద్యార్థిపై రూ.1000 నుంచి రూ.1200 వరకు ట్రాన్స్‌పోర్టు ఛార్జీలను పెంచినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది తమకు అదనపు ఆర్థిక భారంగా మారుతోందని వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంటున్నారు. అయితే ఇంధన ధరలు పెరగడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాహనదారులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చమురు ధరలు ఒక్కసారిగా పెరగాయని.. తప్పనిసరి పరిస్థితుల్లో ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెబుతున్నారు. గతేడాది తమ ఇద్దరు పిల్లలకు కలిసి రూ.6 వేలు ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు చెల్లించామని చెప్పిన ఓ మహిళ.. ఈ ఏడాది అది ఏకంగా రూ.7,500కి పెరిగినట్లు తెలిపారు. ఇక గత సంవత్సరం తమ ఒక్కగానొక్క పిల్లాడిని స్కూల్‌కు పంపించేందుకు ఆటోకు రూ.3,500 చెల్లించగా.. ఈ ఏడాది రూ.4,500కి పెంచారని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. నగర వ్యాప్తంగా తమ పిల్లలను మంచి స్కూల్లో చదివించాలని భావిస్తున్న తల్లిదండ్రులు.. తమ ఇంటికి దూరంగా ఉన్న స్కూళ్లకు పిల్లలను పంపించేందుకు ఆటోలు, ప్రైవేటు కార్లను ఆశ్రయిస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి స్కూల్‌కు తీసుకెళ్లి.. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చేందుకు వాహనదారులు ట్రాన్స్‌పోర్టు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లోనూ ఇలాగే ట్రాన్స్‌పోర్టు ఫీజులు పెంచేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.