
ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్‌పై నటుడు ధనుష్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘రాఫా’ (Rafa) డాక్యుమెంటరీని చూసిన తర్వాత తాను భావోద్వేగానికి
గురైనట్లు తెలిపారు. కెరీర్లో నాదల్ ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ డాక్యుమెంటరీ చూశాకే తనను పూర్తిగా అర్థం చేసుకోగలిగానని ధనుష్ (Dhanush) పేర్కొన్నారు.
‘‘ఈ డాక్యుమెంటరీని చూడటం గొప్ప అనుభూతి. టెన్నిస్ కోర్టులో రఫెల్ నాదల్ (Rafael Nadal) అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఒక అభిమానిగా నేను ఆయనను విమర్శించినందుకు ఇప్పుడు బాధపడుతున్నా. నాదల్ మ్యాచ్‌లలో పాయింట్లు కోల్పోయినప్పుడు, ఓడినప్పుడు నేను టీవీ ముందు కూర్చొని ఆయనపై గట్టిగా అరిచేవాడిని. కానీ, ఆ సమయంలో ఆయన ఎంతటి శారీరక నొప్పిని, మానసిక ఒత్తిడిని భరిస్తూ ఆడారనేది నాకు అస్సలు తెలియదు. ఆ భారాన్ని నాదల్ ఎలా మోశారో ఈ డాక్యుమెంటరీ చూశాకే అర్థమైంది. ఇప్పుడాయన కొన్ని మిలియన్ల మందిలో స్ఫూర్తి నింపారు. ఆయన గురించి ఒక్కమాటలో చెప్పమంటే గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని చెబుతాను ’’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రచారం కోసం చెప్పడం లేదని ధనుష్ స్పష్టం చేశారు.
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (Rafael Nadal) జీవితం ఆధారంగా ‘రాఫా’ తెరకెక్కింది. మే 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. నాదల్ సాధించిన అద్భుత విజయాలు, అతని కెరీర్‌లోని మలుపులు, జయాపజయాలను ఇందులో చూపించారు. టెన్నిస్ కోర్టులో కఠినమైన పోరాటాలు, కోర్టు బయట అతడి వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చూపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.