
‘‘నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘స్లమ్ డాగ్’. యాక్షన్ చిత్రమే అయినా, నిజమైన భావోద్వేగాలే ఇందులో కీలకం’’ అన్నారు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వం వహిస్తూ... ఛార్మి, జె.బి.నారాయణరావుతో
కలిసి నిర్మించిన చిత్రం ‘స్లమ్ డాగ్... 33 టెంపుల్ రోడ్’. విజయ్ సేతుపతి కథానాయకుడు. సంయుక్తా మేనన్ కథానాయిక. టబు ముఖ్యభూమిక పోషించారు. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ని సోమవారం చెన్నైలో నిర్వహించిన వేడుకలో విడుదల చేశారు. ‘‘ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా..?’ అంటూ విజయ్ సేతుపతి చెప్పే సంభాషణలతో టీజర్ మొదలవుతుంది.
వేడుకని ఉద్దేశించి పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘రేపటి తరం అయిన జెన్‌జీ కోసం తీసిన సినిమా ఇది. జెన్ జీ తరం నిన్నటితరం కంటే క్రమశిక్షణ, భావోద్వేగాలు ఉన్నవాళ్లని నమ్ముతాను. వాళ్లంతా కుటుంబాలతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. బయట మనం ఎంతోమంది భిక్షగాళ్లని చూస్తుంటాం. కానీ వాళ్లు నిజంగా ఎవరు? వాళ్ల వెనక ఎన్ని కథలు, భావోద్వేగాలు ఉన్నాయో మనకు తెలియదు. విజయ్ సేతుపతి ఈ సినిమా చేయడమే నాకు చాలా పెద్ద విషయం. ఆయన ఎప్పుడూ సెట్‌కి ఓ కొత్త నటుడిలా వచ్చేవారు. ఆయన ఎంతో ఒదిగి ఉంటార’’న్నారు.
విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విడుదలయ్యే ప్రతి భాషలోనూ ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్, భావోద్వేగాలు అద్భుతంగా ఉంటాయి. పూరి జగన్నాథ్ అత్యుత్తమమైన సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఆయన చెప్పే ప్రతి కథ, ప్రతీ సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. పూరి తీసిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాని తమిళంలో జయం రవితో రీమేక్ చేశారు. అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేశా. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరోగా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయనతో కలిసి పనిచేయడాన్ని ఎంతగానో ఆస్వాదించా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వీటీవీ గణేశ్, జె.బి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.