
‘బిచ్చగాడు’ విజయం తర్వాత కథానాయకుడు విజయ్ ఆంటోని.. దర్శకుడు శశి కలిసి చేసిన సినిమా ‘వంద దేవుళ్లు’. ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. శ్వాసిక, అజయ్, కావ్య తదితరులు కీలక
పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నిహారిక కొణిదెల సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘ఈ లోకంలో ప్రాణాలతో పుట్టిన అందరికీ కనీస అవసరాలుంటాయి. తినడం, నిద్రపోవడం, తోడు వెతుక్కోవడం’’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా. ఈ కథలో భార్యాభర్తల బంధానికి.. తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు ట్రైలర్‌ని బట్టి అర్థమవుతోంది. యాక్షన్ ఘట్టాలు మాస్ ప్రేక్షకుల్ని అలరించేలా ఉన్నాయి. ‘‘నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవర్రా’’ అంటూ ఆఖర్లో శ్వాసిక చెప్పిన డైలాగ్ ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి సంగీతం: బాలాజీ శ్రీరామ్, ఛాయాగ్రహణం: ఎస్బీ దర్శన్ కిర్లోష్.
చాలా సినిమాల్లో లవర్ బాయ్‌లా సందడి చేసిన త్రిగుణ్ కొత్త సినిమా కోసం లుక్ మార్చేశాడు. పూర్తిగా నాటు అవతారంలో కనిపించి సందడి చేయనున్నాడు. ‘జంగా’ పేరుతో తెరకెక్కుతున్న ఆ సినిమాకి కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్నారు. వనత కిలారి సమర్పిస్తోన్న ఈ చిత్రంలో నేహా పఠాన్ కథానాయిక. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రని పోషిస్తున్నారు. త్రిగుణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని సోమవారం ‘జంగా’ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో త్రిగుణ్ కనిపించే తీరు కొత్తగా ఉంది. ఆయన కెరీర్లోనే విభిన్నమైన కథ, పాత్రలతో రూపొందుతున్న చిత్రమిదని స్పష్టమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉందని, త్వరలోనే మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని సినీ వర్గాలు తెలిపాయి. శ్రావణ్, మధునందన్, గగన్ విహారి, చందు గౌడ, సమీర్, నాగమహేశ్, భూపాల్ రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కృష్ణ సౌరభ్, ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్.
ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశం చుట్టూ తిరిగే చిత్రమే ‘ఒక కోర్టు కేస్’. సూర్యాన్ష్, తనిషా మిశ్రా నాయకానాయికలు. గణేశ్ పూడి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. నాగేశ్ పూడి, ముఖేశ్ పూడి సమర్పకులు. జులై 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ ఈ సినిమా టీజర్‌ని ఇటీవల ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేమలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్ని ఒక లీగల్ డ్రామాగా మలుస్తూ చిత్రాన్ని తెరకెక్కించడం బాగుంది. టీజర్ ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది’’ అన్నారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘‘ఓ ప్రేమికుడి న్యాయ పోరాటమే ఈ చిత్రం. బ్రేకప్ తర్వాత ప్రతీకార కోణాన్నీ ఆవిష్కరిస్తుంది. వినోదం, భావోద్వేగాల మేళవింపుగా సాగుతూ, ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని స్పృశించే చిత్రమిదని చెప్పారు నాయకానాయికలు. థర్టీ ఇయర్స్ పృథ్వీ, సత్యకృష్ణ, దయానంద్, ముక్తార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హర్ష ప్రవీణ్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.