తెలంగాణ సర్వే, సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు అక్రమాస్తుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అవినీతి అధికారుల చిట్టా విప్పుతున్న ఏసీబీ అధికారులు..
పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పాతబస్తీలోని ఛత్రినాకలో ఉండే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిరావు.. ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లు సహా మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టగా.. భారీగా డబ్బు, ఆభరణాలు, ఆస్తి పత్రాలు లభ్యం అయ్యాయి.
ఈ క్రమంలోనే ఆయన ఆస్తులు దాదాపు రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1987లో తొలిసారి ఉద్యోగంలో చేరిన సుంకరి నరహరిరావు.. నెలకు రూ.700 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్లో చైన్‌మెన్‌గా ఉద్యోగాన్ని మొదలుపెట్టిన నరహరి రావు..
ఇప్పుడు రూ.200 కోట్లకు పడగలెత్తడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చైన్‌మెన్ ఉద్యోగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరిరావు.. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ హోదా వరకు ప్రమోషన్లతో ఎదిగారు.2020 నుంచి 2024 వరకు రెవెన్యూ శాఖకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (TALIM ) తాలీమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో సుంకరి నరహరిరావుపై భారీగా అవినీతి ఆరోపణలు వచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఆ 4 ఏళ్లలో రెవెన్యూ శాఖలోని ఆర్ఐలు.. డిప్యూటీ తహసీల్దార్లుగా ప్రమోషన్లు కల్పించేందుకు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌లో కొందర్ని పాస్ చేసేందుకు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సుంకరి నరహరిరావు లంచాలు డిమాండ్ చేసి, వసూలు చేసినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది.
. ఈ నేపథ్యంలోనే తాలీమ్ అధికారిగా ఉన్న సమయంలోనే భారీ ఎత్తున లంచాలు స్వీకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తాలీమ్‌కు సంబంధించిన అవినీతి ఆరోపణలపై.. ఉన్నతాధికారులకు ఏసీబీ అధికారులు రిపోర్ట్ సమర్పించనున్నట్లు తెలిసింది. తాజాగా ఏసీబీ సోదాల నేపథ్యంలో రెవెన్యూ శాఖలో తాలీమ్ వ్యవహారంపై చర్చకు దారితీస్తోంది.
నరహరిరావు తాలీమ్‌లో పనిచేసిన సమయంలోనే దాదాపు 200 నుంచి 300 మంది ఆర్ఐలు.. డిప్యూటీ తహసీల్దార్లుగా ప్రమోషన్ పొందినట్లు సమాచారం