
నాగార్జునసాగర్ బ్యాలెన్సింగ్ జలాశయ నిర్మాణంలో ముంపునకు గురైన తండాల్లోని నాలుగు కుటుంబాలు ఎడ్లబండ్లపై మధ్యాహ్న సమయంలో బయలుదేరాయి. రాత్రంతా వెతుకుతూ తమకు అనుకూలమైన, అడవికి సమీపంలోని ఓ ప్రదేశాన్ని
ఎంపిక చేసుకునేసరికి తెల్లవారింది. అక్కడే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. తెల్లవారిన ప్రదేశం కాస్తా కాలక్రమంలో అదే ఊరి పేరుగా మారి ‘తెల్దేవరపల్లి’ అయ్యింది. ఈ గ్రామం ప్రస్తుతం నల్గొండ జిల్లా చందంపేట మండల పరిధిలో ఉంది. దాదాపు 25 ఏళ్లపాటు విద్యుత్తు, రోడ్డు సౌకర్యం లేక అవస్థలుపడ్డ ఇక్కడి ప్రజలు.. నేడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 1984లో విద్యుత్తు సౌకర్యం, ఆశ్రమ పాఠశాల సమకూరడంతో ఆ ఊరి ముఖచిత్రం మారింది. అప్పట్లో విద్యనభ్యసించిన పిల్లలు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం 4 వేల జనాభా, 1,800 మంది ఓటర్లున్న తెల్దేవరపల్లిలో దాదాపు ప్రతి ఇంటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నతస్థానాల్లో పనిచేసే వారున్నారు. మరో 30 కుటుంబాల నుంచి ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లారు. ఈ నేపథ్యంలో దాదాపు 65 ఏళ్ల క్రితం గ్రామస్థాపనకు కృషి చేసిన వాంకుణావత్ హంజ్య, కేతావత్ గన్సింగ్ల విగ్రహాలను ఈ నెల 23న ఏర్పాటు చేసేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.