
ఇంటర్నెట్డెస్క్: ఇరాన్ యుద్ధంలో తనకు సహకరించేందుకు ముందుకురాని ఐరోపా దేశాల విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. నాటో కూటమికి అందిస్తోన్న సహాయాన్ని కత్తిరించేందుకు ట్రంప్
యంత్రాంగం ప్రతిపాదనలు రచిస్తోంది. ఐరోపాలో నాటో (NATO) కార్యకలాపాల కోసం అందుబాటులో ఉంచే విమానాలు, యుద్ధనౌకలను గణనీయంగా తగ్గించాలని అమెరికా యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అగ్రరాజ్యం తన ఆలోచనను గనక అమలు చేస్తే.. సుదూర దాడులు చేయడం, నిఘా వంటి అంశాల్లో నాటో సామర్థ్యాలు పరిమితం కానున్నాయని తెలుస్తోంది.
అమెరికా తన ప్లాన్లో భాగంగా ఎఫ్-16, ఎఫ్-15E ఫైటర్ జెట్ల సంఖ్యను 150 నుంచి 100కు తగ్గొచ్చు. అలాగే, సముద్ర నిఘా విమానాల సంఖ్యను 26 నుంచి 15కు కుదించొచ్చు. ఐరోపాలో అందుబాటులో ఉన్న ఎనిమిది రీఫ్యూయెలింగ్ ట్యాంకర్ విమానాలను ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. జలంతర్గామి, విమాన వాహక నౌకతో సహా ఐరోపాలో నాటో కార్యకలాపాల్లో భాగమయ్యే పలు నౌకలు, విమానాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో తన మిత్రదేశాల రక్షణ కోసం కేటాయించిన రెండు బాంబర్ గ్రూప్లో ఒకదాని స్థానాన్ని మార్చాలనుకుంటోందని సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై అమెరికా (USA) రక్షణశాఖ గానీ, నాటో గానీ స్పందించలేదు. నాటోకు అందించే సహకారంలో సర్దుబాటు చేసుకుంటామని గతవారం యూఎస్ ఈస్టర్న్ కమాండ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కథనాలు రావడం గమనార్హం.
హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన విజ్ఞప్తిని ఐరోపా దేశాలు పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన.. నాటో కూటమి కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఆ కూటమి ఓ కాగితపు పులి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.