ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. సిద్ధాంతంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నం, రాయలసీమ జిల్లాలలో పరిశ్రమలు కోసం భూములు కావాలంటే ఇచ్చేందుకు ముందుకు వస్తారని.. కానీ గోదావరి జిల్లాలలో సెంటు భూమి కూడా ఇచ్చేందుకు అంగీకరించరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గోదావరి జిల్లాలలో భూముల ధరలు భారీగా ఉండటంతో భూమిని సేకరించడం కష్టంగా ఉందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. రాయలసీమ, విశాఖ జిల్లాలలో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తుండటంతో అక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని.. గోదావరి జిల్లాలలో భూములు ఇచ్చేందుకు ముందుకు రాకపోవటంతో పరిశ్రమలు తక్కువగా వస్తున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.గోదావరి జిల్లాలలో భూముల ధరలకు కారణాలు..ఉభయ గోదావరి జిల్లాలలో భూముల ధరలు ఇంతలా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యవసాయం, పారిశ్రామికీకరణ, రవాణా సౌకర్యాలు, నగరీకరణ వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణాలు. డెల్టా ప్రాంతంలోని సారవంతమైన నేలలు వ్యవసాయానికి అత్యంత అనుకూలం. దీంతో ఇక్కడి రైతులు వరితో పాటుగా చేపలు, రొయ్యల సాగు వంటి ఆక్వాకల్చర్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. వాణిజ్య పంటలు బాగా పండే కారణంగా గోదావరి జిల్లాలలో భూములకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆక్వా సాగు ద్వారా లాభాలు గడిస్తూ ఉండటంతో ఇక్కడి రైతులు భూములు అమ్మేందుకు ఆసక్తి చూపించరు. అలాగే ఈ జిల్లాల మీదుగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లు ఉండటంతో వీటికి ఆనుకుని ఉన్న భూముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.ఇక కాకినాడ, ఏలూరు, రాజమండ్రి, భీమవరం, అమలాపురం, పాలకొల్లు వంటి పట్టణాలు క్రమంగా విస్తరిస్తూ ఉండటటంతో.. ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోంది. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారు.. తిరిగి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉండటం కూడా భూముల ధరలు పెరగడానికి కారణమని నిపుణులు చెప్తున్నారు.