
ఇంటర్నెట్ డెస్క్: బెంగాల్‌లోని ఫల్టాలో ఇటీవల రీపోలింగ్ నుంచి వైదొలిగిన టీఎంసీ నేత జహంగీర్ ఖాన్ (Jahangir Khan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ ఎన్నికల సమయంలో దక్షిణ 24 పరగణాల నియోజకవర్గంలో
ఈవీఎంలలోని కమలం గుర్తు దగ్గర ఉన్న బటన్‌ను వినియోగించకుండా దానిని టేప్‌తో కప్పి అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న జహంగీర్ దేశం విడిచి పారిపోతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయనను నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను బెదిరించడం, బటన్ల ట్యాంపరింగ్ నిజమని తేలడంతో ఈసీ ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించింది. ఈ కేసులో జహంగీర్‌పై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగా కలకత్తా హైకోర్టు అతడికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను కోర్టు ఇటీవల ఉపసంహరించుకోవడంతో పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ అజయ్ పాల్ శర్మ 2011 బ్యాచ్ అధికారి. ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరుంది. స్థానికంగా ఆయన్ను పోలీస్ సింగంగా పిలుస్తుంటారు. బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రత్యేక పరిశీలకుడిగా వ్యవహరించిన ఆయన పోలింగ్ సమయంలో ఎవరైనా ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామాలపై జహంగీర్ ఖాన్ స్పందిస్తూ.. ఐపీఎస్ అధికారి ‘సింగం’ అయితే.. తాను ‘పుష్ప’ అని కౌంటర్ ఇచ్చారు. ఆ డైలాగ్ అప్పట్లో వైరల్‌గా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.