
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, యుద్ధాల నేపథ్యంలో ఇటీవలి కాలంలో అనేక దేశాలు తమ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణుశక్తి కలిగిన దేశాలు తమ ఆయుధ
సంపత్తిని మరింత పెంచుకుంటున్నాయి. మన దేశం కూడా ఈ విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధాలు (అణు వార్హెడ్లు) ఉన్నాయని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) వెల్లడించింది. పాకిస్థాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు (Nuclear Weapons) ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
ప్రపంచ దేశాల వద్ద అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రి (SIPRI) సోమవారం విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్హెడ్లను పెంచుకుందని ఈ నివేదిక తెలిపింది. ఇక, చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బీజింగ్ 20 అణు వార్హెడ్లను తన ఆయుధాగారంలోకి చేర్చుకుందని తెలిపింది. ఇక, ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలున్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5,420, అగ్రరాజ్యం వద్ద 5,042 అణు వార్హెడ్లు ఉన్నాయని సిప్రి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి దేశాలు కలిగిన దేశాలు తొమ్మిది కాగా.. వాటి వద్ద మొత్తంగా 12వేలకు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ (370), యూకే (225), ఇజ్రాయెల్ (90), ఉత్తరకొరియా (60) దేశాలున్నాయి.
ఇక, ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది. 2025లో భారత రక్షణ వ్యయం 92.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు సిప్రి నివేదిక తెలిపింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8.9శాతం ఎక్కువ. ఇక, 2021-25 మధ్య ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతుల్లో 8.2శాతం మన దేశానివే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.