తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టావంతంగా నిర్మించతలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు రూపకల్పనలో కీలక అడుగు పడింది. ఈ మెగా సిటీ మాస్టర్ ప్లాన్ తయారీ కన్సల్టెంట్‌గా సింగపూర్‌కు చెందిన ప్రముఖ
గ్లోబల్ డిజైన్ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్స్‌ను ఖరారు చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ( FCDA ) పరిధిలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు టెండర్లలో మొత్తం ఆరు అంతర్జాతీయ సంస్థలు పోటీ పడగా.. అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన డీపీ ఆర్కిటెక్ట్స్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో జూన్ 10న నూతనంగా నిర్మించిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ వేదికపైనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా సదరు సింగపూర్ సంస్థకు అధికారిక ఉత్తర్వులను అందజేయనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌ను పూర్తి చేయడానికి కన్సల్టెంట్‌కు తొమ్మిది నెలల గడువు విధించారు.మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఎఫ్‌సీడీఏ పరిధిలో, మొదటి విడతగా 30 వేల ఎకరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థలంలో భూ వినియోగం, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనను గుర్తించనున్నారు. అందులోనూ అత్యంత ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి కోసం 13 వేల ఎకరాలను ప్రత్యేకంగా వర్గీకరించారు. ఈ ప్రతిపాదిత ల్యాండ్ పూలింగ్‌లో వివిధ రంగాలకు భారీగా భూములను కేటాయించారు. ఇందులో ప్రధానంగా లైఫ్ సైన్సెస్ హబ్ కోసం 4 వేల ఎకరాలు, నివాస ప్రాంతాలైన రెసిడెన్షియల్ జోన్ కోసం 2477 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం 2,177 ఎకరాలు, ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ పార్క్ కోసం 1,976 ఎకరాలు కేటాయించారు. వీటితో పాటు హెల్త్ సిటీ వైద్య సేవల కోసం 594 ఎకరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ సిటీ కోసం 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్ కోసం 313 ఎకరాలు, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ జోన్ కోసం 255 ఎకరాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ఒక భారీ ఎంటర్టైన్మెంట్ జోన్, ఫర్నిచర్ పార్క్, అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్ ఏర్పాటుకు కూడా ప్రాథమిక ప్రతిపాదనల్లో ల్యాండ్‌ను కేటాయించారు.ఎఫ్‌సీడీఏ ప్రాంతం ప్రస్తుతం రెండు ప్రధాన జోన్ల మధ్య విస్తరించి ఉందని అధికారులు వివరించారు. ఎఫ్‌సీడీఏ ఉత్తర భాగం ఇప్పటికే హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031 పరిధిలో విలీనమై, రవాణా నెట్‌వర్క్‌లు, మెట్రోపాలిటన్ కారిడార్లతో అభివృద్ధి చెందుతోందన్నారు. మధ్య భాగంలో ఉన్న హైదరాబాద్ ఫార్మా సిటీ ల్యాండ్‌ను లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి ఫ్లాగ్షిప్ ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే దక్షిణ భాగం మాత్రం పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఉండి ఎలాంటి చట్టబద్ధమైన భూవినియోగ ప్రణాళికలు లేకుండా ఉందన్నారు. ఇలాంటి సమయంలో సరైన మాస్టర్ ప్లాన్ లేకపోతే అస్తవ్యస్తమైన వృద్ధి, అధికార పరిధిల వివాదాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ ఫ్రేమ్‌వర్క్‌కు, ఈ ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లకు మధ్య సమన్వయం కుదురుస్తూ.. ఫ్యూచర్ సిటీని నెట్-జీరో సూత్రాలతో గ్లోబల్ స్టాండర్డ్స్‌లో నిర్మించేందుకే ఈ మాస్టర్ ప్లాన్ వ్యూహం రూపొందించబడిందన్నారు.