
ఇంటర్నెట్‌డెస్క్: మిత్రదేశమైన ఒమన్ (Oman)కు అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ఇరాన్‌తో కలిసి హర్మూజ్ జలసంధి వద్ద నౌకల నుంచి టోల్ వసూలు చేస్తే.. సహించేది లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ అలాంటి చర్యలకు దిగితే.. తమ ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. హర్మూజ్ (Strait of Hormuz) వద్ద టోల్ వసూలు చేసే విధానాన్ని అమెరికా ఎప్పటికీ సహించదని బెసెంట్ (Scott Bessent) పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమన్ ఇరాన్‌తో కలిసి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి చర్యలకు దిగితే.. అమెరికా ఆర్థిక మంత్రిత్వశాఖ వారిని లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధిస్తుందన్నారు. ఈ హెచ్చరికల అనంతరం.. టోల్ వసూలు చేసే ప్రణాళిక ఏదీ తమకు లేదని ఒమన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన్నట్లు బెసెంట్ తెలిపారు. ఒమన్ రాయబారితో తాను ఫోన్లో మాట్లాడానని ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సుంకం విధించే అంశంపై ఎలాంటి ప్రణాళికలు లేవని ఆయన తనతో చెప్పారన్నారు. ఇరుదేశాల మధ్య ఎన్నోఏళ్లుగా ఉన్న సత్సంబంధాలు.. అలాగే కొనసాగించాలని వారు కొరుకుంటున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగించే విషయంపై అమెరికా- ఇరాన్‌లు ఒక ఒప్పందానికి చేరువలో ఉన్నాయని స్కాట్ బెసెంట్ తెలిపారు. అయితే, ట్రంప్ (Donald Trump) ఇంకా దీనిపై సంతకం చేయలేదని తెలిపారు. హర్మూజ్‌లో స్వేచ్ఛా వాణిజ్యం కొనసాగించడం, ఇరాన్ (Iran) తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించడం, అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదనే ట్రంప్ డిమాండ్లను టెహ్రాన్ అంగీకరిస్తే.. ఒప్పందం సాధ్యమవుతుందన్నారు. ఇది పూర్తిగా అధ్యక్షుడి చేతుల్లోనే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో ఇబ్బందులపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. మే నెలలో చమురు ధరలు 10 శాతం
తగ్గాయన్నారు. హర్మూజ్ వద్ద 2వేల నౌకలు నిలిచిపోయినట్లు వెల్లడించారు. ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత.. చమురు ధరలు సాధారణ స్థితికి వస్తాయన్నారు.
ఇక, ఇరాన్‌తో ఒక ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పేర్కొన్నారు. అయితే, ఇందులో కొన్ని చిక్కుముడులు ఇంకా అలాగే ఉన్నాయన్నారు. వాటిపై కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందులో పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.