
‘వీరభద్రుడు’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సూర్య. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన.. మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి రానున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ని నెట్టింట పంచుకున్నారు. అందులో సూర్య వర్షంలో గొడుగు పట్టుకుని స్టైలిష్‌గా నించొని ఫోన్ చూస్తూ కనిపించారు.
‘‘సున్నితమైన హాస్యం.. బలమైన కుటుంబ భావోద్వేగాలతో నిండిన చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దీంట్లో సూర్య వింటేజ్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాకి సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, ఛాయాగ్రహణం: నిమిష్ రవి. ‘ఏదైనా ప్రత్యేకమైనది చేయకపోతే, వారిని సామాన్యులని పిలుస్తారు. చేసిన వాళ్లు కనిపించినా, గుర్తించలేరు’ అంటూ తన రాబోయే చిత్రం ‘భారత భాగ్య విధాత’ సినిమా మోషన్ పోస్టర్ని ఆవిష్కరించింది బాలీవుడ్ హీరోయిన్ కంగన.
‘ది అన్ సీన్ హీరోస్’ అనే వ్యాఖ్యతో ఉన్న ఈ పోస్టర్లో కంగనా ముఖంపై నెత్తుటి మరకలతో ఓ మహిళని ఎంతో తెగించి కాపాడుతున్నట్లు కనిపిస్తుంది. కంగన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోజ్ తపాడియా దర్శకుడు. ఈ సినిమాని మణికర్ణిక ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్ తదితర నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముంబయి ఉగ్ర దాడుల నేపథ్యంలో.. ధైర్యంగా తమ విధులను నిర్వర్తించిన ఆసుపత్రి సిబ్బంది నేపథ్యంలో ఈ చిత్రం రూపొందిందని చిత్ర సన్నిహిత వర్గాలు
తెలిపాయి.
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో హీరో రణ్వీర్ సింగ్‌పై నిషేధం వ్యవహారం చర్చల్లో ఉండగానే ఆయన నుంచి ఓ కొత్త సినిమాకు సంబంధించిన వార్త సందడి చేస్తోంది. రణ్వీర్ ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాత హన్సల్ మెహతా కుమారుడు.. జై మెహతా తెరకెక్కించనున్న చిత్రం ‘ప్రళయ్’. దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు కొంత కాలంగా జరుగుతున్నాయి. ఎట్టకేలకు చిత్రబృందం ఈ సినిమాని ఆగస్టులో పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తుందని సమాచారం. ఇప్పటికే నిర్మాత హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని మునుపెన్నడూ చూడని జాంబీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘ధురంధర్’ చిత్రాలతో రణ్వీర్ దేశవ్యాప్తంగా మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరువయ్యారు.
శేఖర్ మోడల్ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అడుగు’. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో వీఎన్ ఆదిత్య, సముద్ర, అశోక్ కుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో, దర్శక నిర్మాత శేఖర్ మాట్లాడుతూ.. ‘‘అందర్నీ అలరించే కొత్తదనం నిండిన కథతో ఈ చిత్రం రూపొందించనున్నా. ఆడిషన్ చేసి ప్రతిభావంతులైన నటీనటులతో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లనున్నా. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మిని నాగులపల్లి, ఎంవి రఘు, సత్య మాస్టర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్ తన తదుపరి 552వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘శ్రీరామభూమి’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రానికి ఇటీవలే ‘ది కేరళ స్టోరీస్ 2’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రతి దశాబ్దం... శతాబ్దానికో చెప్పాల్సిన ఒక కథ వస్తుంది. సత్యం, విశ్వాసానికి సంబంధించిన కథ ఇది’ అనే వ్యాఖ్యల్ని జోడించారు అనుపమ్. ‘భావోద్వేగాలను ప్రతిధ్వనించే టైటిల్. కుట్రలతో నిండిన కథ. శ్రీ రామభూమి ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంద’ని చిత్రబృందం ఈ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ని ఆవిష్కరించింది. ఈ చిత్రంలో రిత్విక్, అమృత ఖాన్విల్కర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.